Share News

మద్యం మత్తులో వీరంగం

ABN , Publish Date - Aug 29 , 2025 | 12:21 AM

మద్యం మత్తులో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి వచ్చి, అక్కడ మరోసారి దాడులు చేసుకున్నారు.

మద్యం మత్తులో వీరంగం

రెండు వర్గాల ఘర్షణ

చికిత్స పొందుతూ మరోసారి గొడవ

అడ్డు వచ్చిన డాక్టర్‌, వైద్యసిబ్బందిపై దాడి

కదిరిఅర్బన, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి వచ్చి, అక్కడ మరోసారి దాడులు చేసుకున్నారు. ఈక్రమంలో అడ్డొచిన, వైద్యురాలు, సిబ్బందిపై కూడా దాడికి దిగిన ఘటన కదిరిలో గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ్లకు చెందిన అనిల్‌కుమార్‌, సాయిగణేష్‌, రాజశేఖర్‌, భరత, కార్తీక్‌, మణికంఠ, అశోక్‌, మరోవర్గం గిరినాయక్‌, చంప్లానాయక్‌, రెడ్డెప్పనాయక్‌ బుధవారం రాత్రి కుటాగుళ్లలోని బెల్టు షాపు వద్ద చిల్లర విషయంలో గొడవ పడ్డారు. పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. దీంతో ఇరువర్గాల వారు గాయపడ్డారు. వారిని బంధువులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరోసారి ఘర్షణ పడ్డారు. కొంతమంది డాక్టర్‌ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోగా, మరోవర్గం తలుపులు బద్దలు కొట్టి, లోపలున్నవారిపై దాడిచేశారు. అడ్డొచ్చిన డాక్టర్‌ శిరీష, స్టాఫ్‌నర్సు బాల మణి, ఎంఎనఓ దాదాపీర్‌, సెక్యూరిటీగార్డు ఈశ్వరయ్యపై కూడా దాడికి తెగబడి గాయపరిచారు. స్టాఫ్‌ నర్సుకు కుడిచేయి విరిగింది. డాక్టర్‌ డయల్‌ 100కు ఫోన చేయగా, పట్టణ సీఐ నారాయణరెడ్డి తన సిబ్బందితో వెళ్లి ఘర్షణ పడుతున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాల్లో 9మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

వైద్యుల నిరసన

విధుల్లో ఉన్న డాక్టర్‌, సిబ్బందిపై దాడిని నిరసిస్తూ ఆసుపత్రి వర్గాలు గురువారం ఆందోళన చేపట్టాయి. ఉదయం 9నుంచి 10గంటల వరకు విధులు బహిష్కరించారు. వారు మాట్లాడుతూ.. విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బందిపై దాడులకు పాల్పడటం హేయమైన చర్య అన్నారు. ఆందోళనలో ఆసుపత్రి ఇనచార్జ్‌ సూపరింటెండెంట్‌ హుస్సేన, డాక్టర్లు మధూసూదన, అశోక్‌, రిషితా, వైద్యసిబ్బంది ఉన్నారు.

పార్టీకి ఆపాదించడం తగదు: ఎమ్మెల్యే కందికుంట

మద్యం మత్తులో అల్లరిమూకలు గొడవపడితే అది టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలపై దాడి చేసినట్లు కొన్ని చానల్స్‌ లో ప్రసారం చేయడం సరికాదని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ తెలిపారు. ఆయన గురువారం ఆసుపత్రిని సందర్శించి, సంఘటనపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. దుండగులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

రాజకీయాలకు తావులేదు: రత్న, ఎస్పీ

జిల్లా ఎస్పీ రత్న గురువారం కదిరి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. గొడవకు గల కారణాలకు పోలీస్‌ అధికారులతో ఆరాతీశారు. గొడవలో గాయపడి చికిత్స పొందుతున్నవారితో మాట్లాడారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, మద్యం మత్తులోనే దాడులు చేసుకున్నట్లు ఎస్పీ ఎదుట వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ ఘర్షణలో రాజకీయాలకు తావులేదని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

వైసీపీ నేతల హల్‌చల్‌

మద్యం మత్తులో రెండువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడితే దీన్ని వైసీపీ నేతలు రాజకీయాలకు ఆపాదించారు. స్వయంగా బాధితులు, వారి కుటుంబాలు, ఎస్పీ కూడా ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని చెప్పినా వైసీపీ నాయకులు మాత్రం హంగామా మానలేదు. వైసీపీ నియోజకవర్గ సమన్వయ కార్యకర్త మక్బూల్‌ తన అనుచరులతో ఆసుపత్రికి చేరుకుని సంఘటనను టీడీపీపైకి నెట్టడంపై పలువురు విమర్శిస్తున్నారు.

Updated Date - Aug 29 , 2025 | 12:21 AM