బస్టాండ్ కూల్చి ఏడాదైనా పట్టించుకోరా..!
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:42 AM
స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ను వైసీపీ వర్గీయులు ఎలాంటి అనుమతులూ లేకుండా కూల్చేశారు. ఇది గడిచి ఏడాదైనా ఆర్టీసీ అధికారులు వారిపై చర్యలు తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది.
యాడికి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ను వైసీపీ వర్గీయులు ఎలాంటి అనుమతులూ లేకుండా కూల్చేశారు. ఇది గడిచి ఏడాదైనా ఆర్టీసీ అధికారులు వారిపై చర్యలు తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. 1990లో ఆర్టీసీ అధికారులు ఐదెకరాల స్థలాన్ని కొనుగోలు చేసి బస్టాండ్‌ను నిర్మించారు. కొన్నేళ్లు తర్వాత ఆ బస్టాండ్ మూతపడింది. నిరుపయోగంగా ఉన్న బస్టాండ్‌ను ఆర్టీసీ అధికారులు లీజు ప్రతిపాదికన శివారెడ్డి అనే వ్యక్తికి ఇచ్చారు. ఆ స్థలం వ్యవహారాలను స్థానిక వైసీపీ నాయకులు చూసుకునేవారు. గతేడాది అక్టోబరు 6న ఎక్స్‌కావేటర్‌తో బస్టాండ్ భవనాన్ని ఎలాంటి అనుమతులూ లేకుండా కూల్చివేసే పనులు చేపట్టారు. దీనిపై వెంటనే స్థానిక టీడీపీ నాయకులు ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు పోలీసుల ద్వారా ఆ పనులను అడ్డుకున్నారు. అప్పుటికే చాలా భాగం కూల్చివేశారు. నాటి తాడిపత్రి ఆర్టీసీ డిపో మేనేజర్ శంకర్ ఆ భవనాన్ని పరిశీలించారు. ఇది చట్టవిరుద్ధమని, తాము స్థలాన్ని మాత్రమే లీజ్‌కు ఇచ్చామని, బస్టాండ్ కూల్చివేతకు ఎటువంటి అనుమతులూ లేవని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది జరిగి ఏడాదైనా ఆ వైసీపీ వర్గీయులపై ఆర్టీసీ అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. కనీసం వారి నుంచి నష్టాన్ని కూడా రికవరీ చేయలేదు. ప్రభుత్వ భవనాలను కూల్చివేసినా అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. దీనిపై డిపో మేనేజర్‌ను ఫోన ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.