Share News

ZP MEETING: రైతుల ప్రాణాలు పోయినా పట్టదా..?

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:16 AM

రైతుల ప్రాణాలు పోయినా.. సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు అస్వస్థతకు గురైనా అధికారులకు పట్టడం లేదని జడ్పీ చైర్‌పర్సన గిరిజమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా పరిషత కార్యాలయంలోని సమావేశ భవనంలో జడ్పీ చైర్‌పర్సన గిరిజమ్మ అధ్యక్షతన స్టాండింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

ZP MEETING: రైతుల ప్రాణాలు పోయినా పట్టదా..?
ZP Chairperson Girijamma speaking

జడ్పీటీసీ సభ్యుల ఆగ్రహం

వాడీవేడిగా జడ్పీ స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు

అనంతపురం న్యూటౌన, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రైతుల ప్రాణాలు పోయినా.. సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు అస్వస్థతకు గురైనా అధికారులకు పట్టడం లేదని జడ్పీ చైర్‌పర్సన గిరిజమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా పరిషత కార్యాలయంలోని సమావేశ భవనంలో జడ్పీ చైర్‌పర్సన గిరిజమ్మ అధ్యక్షతన స్టాండింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఉదయం 10 గంటకు ప్రారంభం కావాల్సిన సమావేశం జడ్పీటీసీ సభ్యులు సకాలంలో రాకపోవడంతో 11.30 గంటలకు ప్రారంభించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనంతపురం రూరల్‌, బుక్కరాయసముద్రం జడ్‌పీటీసీ సభ్యులు చంద్రమోహన, భాస్కర్‌ జడ్పీ చైర్‌పర్సన దృష్టికి తెచ్చారు. నకిలీ విత్తనాలతో పంటలు చేతికిరాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, విత్తనాలు సరఫరా చేసేవారిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన చైర్‌పర్సన గిరిజమ్మ.. ఈ సమస్యకు తగిన సమాధానం ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మను ఆదేశించారు. సంబందిత ఏడీలతో సభ్యుల ముందుకు వచ్చి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె ఇచ్చే సమాధానానికి సంతృప్తి చెందని సభ్యులు అసలు జిల్లాలో విత్తనాలు అమ్మడానికి ఎంతమందికి అనుమతి ఉంది, విత్తన నాణ్యతపై ఎన్ని తనిఖీలు చేస్తున్నారు, ఎన్ని ప్రాంతాల్లో నాణ్యతలేని విత్తనాలు అమ్ముతున్నట్లు గుర్తించారని నిలదీశారు. ఆర్‌బీకేల్లో యూరియా కావాలని అడిగితే స్టాక్‌ లేదంటున్నారని, యూరియా లేకుండా వరి నాట్లు ఏ విధంగా వేస్తారని నిలదీశారు. దీంతో ఖంగుతిన్న ఉమామహేశ్వరమ్మ వివరాలు మండల అధికారుల వద్దనే ఉంటాయని సమాధానం ఇచ్చారు. మరింత ఆగ్రహానికి లోనైన సభ్యులు ఆర్‌బీకేల్లో, మండల స్థాయి అధికారుల వద్ద వివరాలు ఉంటే మీతో సమావేశంలో ఎందుకు చర్చించాల్సి వస్తుందని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన సొమ్ము చాలా మందికి పడలేదని తెలిపారు.


విద్యార్థుల సమస్యలు పట్టించుకోరా..?

విద్యార్థులు అస్వస్థతకు గురైనా అధికారులకు పట్టదా అని పలువురు సభ్యులు ప్రశ్నించారు. ఈమధ్య కాలంలో సంక్షేమ హస్టళ్లు, గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజనం అందించే పాఠశాలల్లోను భోజనం తిని విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నారని తెలిపారు. స్పందించిన డీఈఓ ప్రసాద్‌బాబు మాట్లాడుతూ.. నాణ్యత లేని భోజనం, ఇతర సమస్యలతోనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన జడ్పీటీసీ సభ్యులు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. బుక్కరాయసముద్రం జడ్పీటీసీ భాస్కర్‌ మాట్లాడుతూ.. సిద్దరాంపురం జిల్లా పరిషత పాఠశాలలో తమ పిల్లలను చదివిస్తున్నామని, అక్కడ మధ్యాహ్న భోజనం చాలా దారణంగా ఉందన్నారు. అలాంటప్పుడు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. రొద్దం మండలంలో పరిస్థితి మరింత దారణంగా ఉందని స్థానిక జడ్పీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ కారం ఎక్కువ ఉందని విద్యార్థులు భోజనం కిందపడేసిన ఘటన సోషల్‌ మీడియాలో వచ్చినా అధికారుల్లో స్పందన రాలేదన్నారు. జిల్లాకు కూత వేటు దూరంలో ఉండే బుక్కరాయసముద్రం మండలంలోని పాఠశాలల్లో విద్యార్థులకు ప్లేట్లు కడుక్కోవడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. మరుగుదొడ్లు సరిగా లేక గుట్టల వెంబడి పోతున్నారని అన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని అధికారులను నిలదీశారు. సమావేశంలో జడ్పీ సీఈఓ శివశంకర్‌, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డిప్యూటీ చైర్‌పర్సన నాగరత్న, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 12:16 AM