పెరిగిన కంది సాగు
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:20 AM
మండలంలో గతంలో అధికంగా సాగుచేసే వేరుశనగ పంటపై రైతు లు కాలక్రమేన నిరాసక్తి చూపుతున్నారు
కూడేరు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): మండలంలో గతంలో అధికంగా సాగుచేసే వేరుశనగ పంటపై రైతు లు కాలక్రమేన నిరాసక్తి చూపుతున్నారు. వేలాది రూ పాయలు అప్పులు చేసి సాగు చేస్తే, సకాలంలో వర్షాలు రాక పంటలు పండక పలుమార్లు నష్టపోయారు. దీంతో పెట్టుబడులు కూడా రాకపోవడంతో అనేక మంది ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపారు. తక్కువ పెట్టుబడులతో సాగు చేసే ఆముదం, కంది సాగు విస్తీర్ణం మూడేళ్లల్లో భారీగా పెరిగింది. కంది, ఆముదం పంటలకు మార్కెట్‌లో ఆశాజనంగా ధర పలుకుతుండటంతో రైతులు ఆ పంటల సాగు చేస్తున్నారు.
కంది సాగే అధికం : మండలంలో ఆముదం పంట సాగు కంటే కంది పంటకే రైతులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆముదం పంటకు తెగుళ్లు ఎక్కువగా సోకుతాయి. దీంతో ఆముదం కంటే కందినే ఎక్కువగా సాగు చేస్తున్నారు. అంతేకాకుండా మార్కెట్‌లో కందులకు మంచి డిమాండ్ ఉండటంతో అనేక మంది రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
ఏటా సాగు ఇలా.. : 2023 ఖరీ్‌ఫలో ఆముదం పంటను 10,240 ఎకరాల్లో సాగు చేయగా, కంది 3,103 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. 2024 ఖరీ్‌ఫలో ఆముదం సాగు 5,400 ఎకరాలకు పడిపోయి, కంది 9,202 ఎకరాలకు పెరిగింది. 2025 ఖరీ్‌ఫలో ఆముదం పంట 6,537 ఎకరాల్లో సాగు చేయగా, కంది ఏకంగా 11, 962 ఎకరాల సాగు చేస్తున్నారు. ఇలా ఏటా కంది సాగు విస్తీర్ణం మండలంలో పెరుగుతోంది. ప్రస్తుతం కంది పంట పూత, పిందే దశలో ఉంది. వ్యవసాయశాఖ అధికారులు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని పలు గ్రామాల్లో నిర్వహిస్తూ కంది పంటపై రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు.