Share News

Crickter Deepika స్ఫూర్తి పతాక.. దీపిక

ABN , Publish Date - Dec 09 , 2025 | 12:39 AM

ప్రతిభకు అంధత్వం అడ్డుకాదని నిరూపిస్తూ, దేశం గర్వించేలా టీ-20 క్రికెట్‌ ప్రపంచకప్‌ సాధించిన దీపిక ఎందరికో స్ఫూర్తి అని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.

Crickter Deepika స్ఫూర్తి పతాక.. దీపిక
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సవిత

అంధుల భారత క్రికెట్‌ జట్టు కెప్టెనకు ఘన సన్మానం

దీపిక ప్రతిభను కొనియాడిన ప్రజాప్రతినిధులు, అధికారులు

ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు సూచన

మడకశిర/మడకశిరటౌన, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రతిభకు అంధత్వం అడ్డుకాదని నిరూపిస్తూ, దేశం గర్వించేలా టీ-20 క్రికెట్‌ ప్రపంచకప్‌ సాధించిన దీపిక ఎందరికో స్ఫూర్తి అని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. అంధుల టీ-20 క్రికెట్‌లో భారత జట్టును ప్రపంచ విజేతగా నిలిపిన కెప్టెన దీపికను సోమవారం మడకశిరలో ఘనంగా సన్మానించారు. స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సాధించాలి అన్న పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్ని అయినా చేరుకోవచ్చని దీపిక నిరూపించిందన్నారు. హేళనలు పట్టించుకోకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అకుంఠిత దీక్షతో దేశ చరిత్రలో తనపేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుందని ప్రశంసించారు. దేశ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య వంటి గొప్ప వ్యక్తుల చేత మెప్పు పొందిన క్రీడాకారిణిగా దీపిక నిలిచిందన్నారు. ఆమె ప్రతిభకు ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.10లక్షలు, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్‌.రాజు రూ.2లక్షలు, తాను రూ.2.16లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు.

కష్టపడితే ఏదైనా సాధ్యమే..: ఎమ్మెల్యే ఎంఎస్‌రాజు

లక్ష్యం చేరాలనే సంకల్పం ముందు పేదరికం, దివ్యాంగత్వం వంటివి ఏవీ అడ్డురావని, కష్టపడితే సాధించలేదని ఏమీ ఉండదని నిరూపించిన క్రీడాకారిణిగా దీపిక నిలిచారని ఎమ్మెల్యే ఎం.ఎస్‌.రాజు అన్నారు. ప్రపంచపటంలో మడకశిర పేరును నిలిపిన దీపికను మనందరం సత్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మడకశిర ప్రాంత విద్యార్థులు మరో దీపికలా విజయాలను అందుకొని ఈప్రాంతానికి కీర్తిని తీసుకురావాలని కోరారు.

రోల్‌ మోడల్‌ : సింధూరారెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే

దీపిక అంధుల టీ-20 ప్రపంచకప్‌ను భారతకు అందించి రోల్‌మోడల్‌గా నిలిచారని పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి అన్నారు. అనుకొన్నది సాధించడానికి పేదరికం, దివ్యాంగత్వం, హేళనలు అడ్డుకాదని నిరూపించిన దీపిక ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. విద్యార్థులు ఆమె స్ఫూర్తిగా రాణించాలన్నారు.

మట్టిలో మాణిక్యం : సాయికుమార్‌, సినీనటుడు.

మన మట్టిలో పుట్టిన మాణిక్యం దీపిక అని ప్రముఖ సినీ నటుడు సాయికుమార్‌ ప్రశంసించారు. ప్రతి విద్యార్థి దీపికను స్ఫూర్తిగా తీసుకుని రాణించాలన్నారు. మొట్టమొదటి అంధుల టీ-20 ప్రపంచకప్పును అందించి దేశం అంతా తనవైపు చూసేలా నిలిచిన గొప్ప క్రీడాకారిణి దీపిక అని అన్నారు.

ఆత్మస్థైర్యంతో..

: గుండుమల తిప్పేస్వామి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

ఆత్మస్థైర్యం, బలమైన విశ్వాసంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏమీ లేదని దీపిక నిరూపించిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి అన్నారు. మడకశిర పేరును ప్రపంచస్థాయిలో పరిచయం చేసిన దీపిక ప్రతిభ ప్రశంసనీయమన్నారు. దీపికను అందరూ స్ఫూర్తిగా తీసుకొని ఎదగాలన్నారు.

నిరంతర కృషితోనే గుర్తింపు

: కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, ఎస్పీ సతీష్‌కుమార్‌

నిరంతరం కృషి, పోరాటం వల్ల దీపిక తాను అనుకొన్న లక్ష్యాన్ని సాధించారని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌లు అన్నారు. దీపిక సన్మాన సభలో వారు మాట్లాడుతూ హేళనలు ఎదురైనా నిరుత్సాహపడకుండా కలలుగన్న లక్ష్యాన్ని దీపిక చేరారని ప్రశంసించారు. ఆమె ప్రతిభ ముందు అంధత్వం కూడా చిన్నబోయిందన్నారు. ప్రతి ఇబ్బందిని అవకాశంగా మలుచుకుని నేడు భారత జట్టును ప్రపంచ విజేతగా నిలిపిందని అభినందించారు. ఇంతటి ప్రతిభాశాలి మడకశిరకు చెందిన యువతి కావడం ఇక్కడి ప్రజలకు గర్వకారణమన్నారు.

అవమానాలు, విమర్శలు అధిగమించి...

: దీపిక, అంధుల క్రికెట్‌ జట్టు కెప్టెన

చిన్నప్పటి నుంచి ఎదురైన అవమానాలు, విమర్శలు నాలో పట్టుదలను పెంచాయి. దాని ఫలితమమే నేటి నా విజయమని అంధుల క్రికెట్‌ జట్టు కెప్టెన దీపిక అన్నారు. 2019లో కర్ణాటకలో అంధుల క్రికెట్‌ జట్టుకు ఎంపిక కావడం, కోచ మహంతేష్‌ సహకారం వల్లే జాతీయ జట్టుకు సారథ్యం వహించే సామర్థ్యం వచ్చినట్లు తెలిపారు. అందరి సహకారం వల్లే మొదటిసారి జరిగిన అంధుల టీ-20 ప్రపంచకప్‌లో జట్టును విజేతగగా నిలిపినట్లు పేర్కొన్నారు. కప్పు సాధించడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, మడకశిర ప్రాంత ప్రజలు చూపిన ఆదరణ జీవితంలో మరువలేనన్నారు. ఎమ్మెల్యే ఎం.ఎస్‌.రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సహకారం కూడా మరువలేనన్నారు.

అడుగడుగునా నీరాజనం

మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం తంబాళహట్టి గ్రామానికి చెందిన దీపిక భారత అంధుల టీ-20 జట్టు కెప్టెనగా ప్రపంచకప్‌ సాధించి తొలిసారి సోమవారం మడకశిరకు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం.ఎస్‌.రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో భారీ అభినందన ర్యాలీని నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి, సినీనటుడు సాయికుమార్‌తో కలిసి దీపిక ర్యాలీలో పాల్గొన్నారు. అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యే ఎం.ఎస్‌.రాజు క్యాంప్‌ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. రాజీవ్‌గాంధీ సర్కిల్‌మీదుగా మడకశిర జూనియర్‌ కళాశాల మైదానం వరకు వేలాది మంది విద్యార్థులు, క్రీడాకారుల నడుమ ర్యాలీ సాగింది. అనంతరం జూనియర్‌ కళాశాల మైదానంలో సన్మాన సభ నిర్వహించారు. కార్యక్రమంలో కోచ మహంతేష్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసమూర్తి, వక్కలిగ కార్పొరేషన చైర్మన లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ చైర్మన నరసింహరాజు, మైనారిటీ కార్పొరేషన డైరెక్టర్‌ భక్తర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 12:39 AM