TOILETS ISSUE: మరుగుదొడ్ల నిర్మాణ పనులపై వివాదం
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:10 AM
పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు మంజూరైన మరుగుదొడ్లు నిర్మాణ పనులు చేపట్టే విషయంపై టీడీపీ నాయకుల మధ్య వివాదం చెలరేగింది. రూ.15లక్షలు వ్యయంతో పాఠశాలలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పనులు వివాదం కారణంగా అర్థాంతరంగా ఆగిపోయాయి.
గోరంట్ల, డిసెంబరు22 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు మంజూరైన మరుగుదొడ్లు నిర్మాణ పనులు చేపట్టే విషయంపై టీడీపీ నాయకుల మధ్య వివాదం చెలరేగింది. రూ.15లక్షలు వ్యయంతో పాఠశాలలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పనులు వివాదం కారణంగా అర్థాంతరంగా ఆగిపోయాయి. ఉపాధి పథకం ద్వారా పాఠశాలలో ఐదు బాతరూమ్‌లు, ఐదు మరుగుదొడ్లు మంజూరుకాగా, టీడీపీ నాయకుడు సోముశేఖర్‌కు పనులు కేటాయించారు. ఈనెల 4న పనులు ప్రారంభించి, గుంత తవ్వి రాతి నిర్మాణ పనులు పూర్తిచేసి, మార్కింగ్ ఇచ్చారు. పనులు సజావుగా సాగడానికి పాఠశాల ప్రహరీ కొంత తొలగించి, మార్గం ఏర్పాటు చేశారు. తమకు తెలియకుండా పనులు కేటాయించారని 1 వార్డుకు చెందిన టీడీపీ నాయకులు అభ్యంతరం తెలపడంలో పనులు అగిపోయాయి. 156మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు మరుదొడ్లు చాలక ఇబ్బంది పడుతుండడంతో ప్రభుత్వం వాటిని మంజూరు చేసింది. ప్రహరీ తొలగించడంతో పాఠశాలకు రక్షణ కరువైంది. పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రిన్సిపాల్ చంద్రకళ కోరారు. మరుగుదొడ్ల పనులను స్థానిక టీడీపీ నాయకులు మాజీ వార్డు సభ్యులు సుధాకర్, రామచంద్ర, మునిస్వామి, ప్రతా్‌పనాయుడు, చంద్రశేఖర్‌కు కొత్తగా కేటియించినట్లు చెప్పారు. తమకు పనులు కేటాయించారని, వెంటనే పనులు చేసి, పూర్తి చేస్తామని సుధాకర్ తెలిపారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ మోహనను వివరణ కోరగా వివాదం కారణంగా పనులు ఆపివేశామన్నారు. కొత్తవారికి పనులు అప్పగించామన్నారు.