కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:44 PM
పెన్నహోబిలం లక్ష్మినరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో టెంకాయలు రూ.40లకు విక్రయించాల్సి ఉంది. ఆ మేరకు నిర్వహించిన వేలంపాటలో దక్కించుకున్న కాంట్రాక్టర్.. ప్రస్తుతం ఒక్కో టెంకాయని రూ.50కు అమ్ముతున్నాడు.
ఉరవకొండ, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): పెన్నహోబిలం లక్ష్మినరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో టెంకాయలు రూ.40లకు విక్రయించాల్సి ఉంది. ఆ మేరకు నిర్వహించిన వేలంపాటలో దక్కించుకున్న కాంట్రాక్టర్.. ప్రస్తుతం ఒక్కో టెంకాయని రూ.50కు అమ్ముతున్నాడు. అది కూడా క్వాలిటీ లేని వాటిని. ఆ కాంట్రాక్టర్ హోల్‌సేల్‌లో రూ.15-రూ.20 ఉన్న టెంకాయలు తెచ్చి.. ఆలయ ప్రాంగణంలో రూ. 50కి విక్రయిస్తున్నా డు. ఇలా ఆలయ ప్రాంగణంలోనే కాంట్రాక్టర్ ని బంధనలు ఉల్లఘిస్తున్నా.. ఆలయ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
కొరవడిన పర్యవేక్షణ
ఆలయ కార్యనిర్వహణ అధికారి దీర్ఘకాలిక సెలవులో వెళ్లడంతో జిల్లా దేవాదాయ శాఖ అధికారిని ఇనచార్జీ ఈఓగా నియమించారు. జిల్లా దేవాదాయశాఖ అధికారి అనంతపురానికే పరిమితమైయ్యారు. కేవలం ఒక జూనియర్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. ఆయన కూడా ఉద్యోగోన్నతిపై తిరుగుతున్నారు. దీంతో పర్యవేక్షించే వారే లేరు. దీనిపై ఇనచార్జ్ ఈఓ తిరుమలరెడ్డిని వివరణ కోరగా.. టెంకాయలను అధిక ధరలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. గతంలోనూ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. మరళా ఇలాగే కొనసాగితే లీజు రద్దు చేస్తామన్నారు.