ఆధార్ అప్‌డేట్ కోసం అవస్థలు
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:46 PM
స్థానిక సచివాలయంలో పై అంతస్తులో ఆధార్ అప్‌డేట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆధార్ అప్‌డేట్ చేసుకోవడానికి వచ్చిన దివ్యాంగులు పై అంతస్తులోకి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు.
యాడికి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): స్థానిక సచివాలయంలో పై అంతస్తులో ఆధార్ అప్‌డేట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆధార్ అప్‌డేట్ చేసుకోవడానికి వచ్చిన దివ్యాంగులు పై అంతస్తులోకి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని కమలపాడు గ్రామానికి చెందిన దివ్యాంగుడు మహేష్ ఆధార్‌లో బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం గురువారం కమలపాడు గ్రామం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న యాడికిలోని సచివాలయం - 2కు మూడు చక్రాల సైకిల్‌లో వచ్చాడు. తీరా ఇక్కడకు వచ్చాక చూస్తే ఆధార్ కేంద్రం పై అంతస్తులో ఏర్పాటు చేసినట్లు సచివాలయ సిబ్బంది తెలిపారు. ఏ మాత్రం మెట్లపైకి ఎక్కలేని మహేష్ తమలాంటి వారి పరిస్థితి ఏమిటని ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లాడు. అయితే ఎంపీడీఓ అక్కడే లేకపోవడంతో కమలపాడుకు తిరిగి వెళ్లాడు. ఈ విషయాన్ని ఎంపీడీఓ వీరరాజు దృష్టికి తీసుకువెళ్లగా... ‘ సచివాలయ సిబ్బందితో మాట్లాడుతాం. దివ్యాంగుల ఆధార్ అప్‌డేట్ కోసం వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు వారికి అనుకూలంగా ఆధార్ అప్‌డేట్ చేసి పంపించాలని ఆదేశాలు ఇస్తాం.’ అని తెలిపారు.