దళారుల నిలువు దోపిడీకి చెక్
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:44 PM
రైతులు పండించిన పంటను గ్రామంలోని కొంత మంది దళారులు ఇష్టమొచ్చిన ధరలతో మోసం చేస్తూ దోపిడీకి పాల్పడేవారు
విడపనకల్లు, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన పంటను గ్రామంలోని కొంత మంది దళారులు ఇష్టమొచ్చిన ధరలతో మోసం చేస్తూ దోపిడీకి పాల్పడేవారు. దీంతో ఈ దళారుల దోపిడీని అడ్డుకునేందుకు మండలంలోని పాల్తూరు గ్రామస్థులు ఏకమయ్యారు. గ్రామంలోని రైతులంతా ఒకే దళారీకి పంటలు మొత్తం సంవత్సరం పాటు అమ్మాలన్ని.. ఆ దళారీ ఎంపికకు గురువారం బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఇందులో అనేక మంది దళారులు పోటీపడ్డారు. అదే గ్రామానికి చెందిన దాసరి శీన రూ. 6.85 లక్షలకు ఆ వేలం దక్కించుకున్నారు. ఇకపై గ్రామంలో ఏ రైతు పండించిన పంట అయినా సరే ఆయన ఆధ్వర్యంలో విక్రయించాలని.. ఏ ప్రాంతం నుంచి వ్యాపారులు వచ్చినా ఆయన ద్వారానే పంటలను కొనాలని తీర్మానించారు. వేలం ద్వారా వచ్చిన ఆ మొత్తాన్ని గ్రామంలోని ఆలయ అభివృద్ధికి ఉపయోగిస్తామని ఆ గ్రామ పెద్దలు తెలిపారు.