Share News

చెరువు నిర్వాసిత రైతులకు తీపికబురు

ABN , Publish Date - Aug 06 , 2025 | 02:02 AM

జిల్లాలో అతి పెద్దదైన బుక్కపట్నం చెరువు నిర్వాసిత రైతులకు పరిహారం పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమర్పించిన వినతి మేరకు సీఎం కార్యాలయం సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతోంది.

చెరువు నిర్వాసిత రైతులకు తీపికబురు
రైతుల సమస్యను ముఖ్యమంత్రికి వివరిస్తున్న ఎమ్మెల్యే, మాజీ మంత్రి (ఫైల్‌)

పరిహారం పంపిణీకి ప్రభుత్వం చర్యలు

ఎమ్మెల్యే వినతికి స్పందించిన సీఎం చంద్రబాబు

బుక్కపట్నం, ఆగస్టు5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అతి పెద్దదైన బుక్కపట్నం చెరువు నిర్వాసిత రైతులకు పరిహారం పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమర్పించిన వినతి మేరకు సీఎం కార్యాలయం సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతోంది. బుక్కపట్నం చెరువు ఉమ్మడి జిల్లాలోనే పెద్దది. గతంలో చెరువు పూర్తిగా నిండది కాదు. టీడీపీ హయాంలో హంద్రీనీవా కాలువ ద్వారా పూర్తిస్థాయిలో నింపారు. 0.77 టీఎంసీ నీరు నిల్వ చేయడంతో చెరువు భూమితోపాటు పక్కనున్న ప్రైవేటు భూములు కూడా మునిగాయి. దీంతో వాటిలో పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులు రోడ్డున పడ్డారు. పరిహారం అందించి ఆదుకోవాలని గత వైసీపీ హయాంలో పాలకులు, ఉన్నతాధికారులకు పదేపదే వినతులు ఇచ్చారు. ఎవ్వరూ పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో 150 రైతు కుటుంబాలు పొట్ట చేతపట్టుకుని, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయి. పలువురు రైతులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. గతేడాది కూటమి ప్రభుత్వం కొలువుదీరాక సమస్యను రైతులు.. ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ముఖ్యమంత్రి సమస్య పరిష్కరించాలని సీఎంఓ ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు సూచించారు. ఆ మేరకు నెల రోజుల్లోగా సమస్య పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిహారం పంపిణీకి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 06 , 2025 | 02:02 AM