బొమ్మనహాళ్ ఎంపీపీ రాజీనామా
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:58 PM
మండల రాజకీయాల్లో తెరవెనుక నడిచిన పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఎంపీపీ పద్మ రాజీనామా వ్యవహారం చివరకు అధికారికంగా బయటపడింది.
బొమ్మనహాళ్, డిసెంబరు, 16(ఆంధ్రజ్యోతి): మండల రాజకీయాల్లో తెరవెనుక నడిచిన పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఎంపీపీ పద్మ రాజీనామా వ్యవహారం చివరకు అధికారికంగా బయటపడింది. ఈ పరిణామాన్ని నెలన్నర కిత్రమే ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురాగా.. ప్రస్తుతం నిర్ధారణ అయింది. గుట్టుచప్పుడు కాకుండా ఎంపీపీ పద్మ రాజీనామాను అధికారులు ఆమోదించారు. మంగళవారం వైస్‌ఎంపీపీ నాగరత్నమ్మకు ఇనచార్జి ఎంపీపీ బాధ్యతలు అప్పగించారు. ఈ మార్పు మండల రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
మాట తప్పిన కాపు : మండలంలో మొత్తం 16 మంది ఎంపీటీసీలు ఉండగా.. అందరూ వైసీపీకి చెందిన వారే. అప్పట్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో అందరూ వైసీపీ సభ్యులే గెలిచారు. ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనకు సన్నిహితుడైన చంద్రశేఖర్ రెడ్డి భార్య, శ్రీధరఘట్ట ఎంపీటీసీ పద్మకు ఎంపీపీగా అవకాశం కల్పించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పనిచేసిన ముల్లంగి నారాయణస్వామి తన భార్య నాగమణి (ఉప్పరహాళ్ ఎంపీటీసీ)కి ఎంపీపీ పదవి ఆశించారు. చివరి వరకు పోరాడినా నిరాశే మిగిలింది. ఎంపీపీ పదవి ఇస్తానని మాటిచ్చి చివరి క్షణంలో ముల్లంగి నారాయణస్వామికి మొండిచేయి చూపిన కాపు.. ఎంపీపీ పదవీ కాలాన్ని పంచే ఏర్పాటు చేస్తానని అప్పట్లో చెప్పినట్లు సమాచారం. తొలుత రెండున్నరేళ్లు చంద్రశేఖర్‌రెడ్డి భార్యకు... ఆ తర్వాత నాగమణికి అవకాశం ఇస్తానని చెప్పి శాంతింపజేశారు.
రెండున్నరేళ్ల తర్వాత అన్యాయమే.. : రెండున్నరేళ్ల తర్వాతైనా తమకు న్యాయం చేస్తాడని ముల్లంగి సోదరులు.. కాపుపై ఆశలు పెట్టుకుంటే నిరాశే మిగిలింది. దీంతో అప్పటి నుంచి కాపుపై ముల్లంగి సోదరులు గుర్రుగా ఉన్నారు. వైసీపీలో ఉన్నా.. కాపు చేసిన ద్రోహానికి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత 2024లో సార్వత్రిక ఎన్నికలు రావడంతో చంద్రబాబునాయడు, కాలవ శ్రీనివాసులు సమక్షంలో ముల్లం గి నారాయణస్వామి, ఆయన సోదరుడు భాస్కర్ టీడీపీలో చేరారు.
కొత్త ఎంపీపీ నాగమణి : ఒప్పందం ప్రకా రం రెండున్నరేళ్ల తర్వాత ఎంపీపీలు మారాల్సి ఉన్నా.. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అండతో పద్మ అలాగే కొనసాగుతూ వచ్చారు. ఇది అన్యాయమని వైసీపీ ఎంపీటీసీలు కూడా బాహాటంగా చెప్పుకొచ్చారు. మాట ప్రకారం ముల్లంగి నారాయణస్వామి సతీమణి నాగమణికి ఎంపీపీ పదవి ఇవ్వాలని వారు సై తం అంగీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీపీ పద్మ రాజీనామా చేయడంతో ఎంపీపీ అవకాశం నాగమణిని వరించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 16 ఎంపీటీసీల్లో ఎం పీపీ, వైస్ ఎంపీపీ మినహా మిగిలిన వారంతా నాగమణి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కూటమి అధికారంలో ఉండటం.. ము ల్లంగి సోదరులు టీడీపీలో ఉండటంంతో ఎంపీ పీ సీటుకు మార్గం సుగమమైందని తెలుస్తోంది. ముల్లంగి సోదరులు ఇప్పటికే ఎంపీటీసీలతో లాబీయింగ్ చేసినట్లు సమాచారం. నాగమణిని ఎంపీపీ చేయడానికి తమకు అభ్యంతరం లేదని ఎంపీటీసీలు చెప్పినట్లు సమాచారం. ఎంపీపీ పద్మ రాజీనామాతో మండలంలో రాజకీయ వా తావరణం వేడిక్కింది. కొత్తగా ఎంపీపీ సీటులో ఆశీనులయ్యే వరకు ఇంకెలాంటి మా ర్పులు ఉంటాయోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
రెండు నెలలు మౌనం.. : ఆంధ్రజ్యోతి కథ నం వెలువడిన వెంటనే రెండు రోజుల్లోనే తన రాజీనామా విషయాన్ని విలేకరుల సమావేశం లో వెల్లడిస్తామని ఎంపీపీ పద్మ, ఆమె భర్త చం ద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. రెండు నెలలు గడిచినా ప్రకటన వెలువడలేదు. ఇప్పుడు ఒక్కసారిగా రాజీనామా వెలుగులోకి రావడంతో ఎంపీ పీ ఎవరు అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఇనచార్జి ఎంపీపీగా నాగరత్నమ్మ : ఎంపీపీ పద్మ రాజీనామా ఆమోదం అనంతరం మండల అభివృద్ధి వ్యవహారాల్లో ఖాళీ ఏర్పడకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఎంపీడీఓ విజయభాస్కర్.. ఇనచార్జి ఎంపీపీగా వైస్ ఎంపీపీ-2 నాగరత్నమ్మకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్యులు ఇచ్చారు.