కాలర్‌రాట్, విల్ట్ తెగుళ్లతో జాగ్రత్త
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:53 PM
మిరప పంటలకు కాలర్ రాట్, విల్ట్ తెగుళ్లు సోకితే.. పంట పూర్తిగా దెబ్బతింటుందని, వీటిని నివారణకు మందులు లేవని, ముందస్తు చర్యలతోనే వీటిని అడ్డుకోవచ్చని రేకుల కుంట శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు.
విడపనకల్లు, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): మిరప పంటలకు కాలర్ రాట్, విల్ట్ తెగుళ్లు సోకితే.. పంట పూర్తిగా దెబ్బతింటుందని, వీటిని నివారణకు మందులు లేవని, ముందస్తు చర్యలతోనే వీటిని అడ్డుకోవచ్చని రేకుల కుంట శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. మండలంలోని ఉండబండ, పాల్తూరు గ్రామాల్లోని మిరప పంటలను సీనియర్ శాస్త్రవేత్తలు రమణాచారి, దినేష్ గురువారం పరిశీలించారు. కాలర్ రాట్, విల్ట్ తెగుళ్లు ఒక మొక్క నుంచి మరో మొక్కకు సోకుతాయని, కావున ఈ తెగుళ్లు సోకిన మొక్కలను వెంటనే తొలగించాలని అన్నారు. సాళ్లుకు నీరు పారుకుండా చూసుకోవాలని, డ్రిప్‌ను వాడితే తెగుళ్లు ఇతర మొక్కలకు సోకవని తెలిపారు. అనంతరం నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా హార్టికల్చర్ అధికారి ఉమాదేవి, హెచఓ యామిని మాట్లాడుతూ.. ఏటా పంట మార్పిడి చేస్తేనే మంచి దిగుబడులు సాధ్యమన్నారు. ఒకే పంటను సాగు చేయటంతో ఇలాంటి తెగుల్లు వస్తాయన్నారు. ఒకసారి మిరప సాగు చేసిన పొలంలో మూడేళ్ల తర్వాతే మళ్లీ ఆ పంటను సాగు చేయాలన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.