Share News

ఆరితేరిన దొంగల పనేనా?

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:49 AM

మండలంలోని తూమకుంట చెక్‌పోస్టులో గతనెల 26న అర్ధరాత్రి బ్యాంకులో భారీ చోరీ కేసులో నేటికీ ఎలాంటి ఆధారమూ దొరకలేదు. దీనిని బట్టి చూస్తే పక్కా ప్రొఫెషనల్స్‌ చోరీ చేసినట్లు తెలుస్తోంది. 592 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన సుమారు రూ.10కోట్ల విలువచేసే బంగారం చోరీ చేసుకెళ్లారు.

ఆరితేరిన దొంగల పనేనా?
లాకర్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ, డీఎస్పీ

పోలీసులకు సవాల్‌గా బ్యాంకు చోరీ కేసు

ఆధారాల కోసం ముమ్మర దర్యాప్తు

నాలుగు రాష్ట్రాలకు.. ఎనిమిది బృందాలు

హిందూపురం, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని తూమకుంట చెక్‌పోస్టులో గతనెల 26న అర్ధరాత్రి బ్యాంకులో భారీ చోరీ కేసులో నేటికీ ఎలాంటి ఆధారమూ దొరకలేదు. దీనిని బట్టి చూస్తే పక్కా ప్రొఫెషనల్స్‌ చోరీ చేసినట్లు తెలుస్తోంది. 592 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన సుమారు రూ.10కోట్ల విలువచేసే బంగారం చోరీ చేసుకెళ్లారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చాక పోలీసులు రంగప్రవేశం చేసి వివరాలు సేకరించారు. ఘటనాస్థలంలో ఆధారాలు లభించకుండా దొంగలు జాగ్రత్త పడ్డారు. చోరీకి పాల్పడినది ఉత్తరాది ముఠా అయి ఉంటుందన్న కోణలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

సవాల్‌గా మారిన కేసు

ఇంత పెద్దమొత్తంలో బంగారాన్ని చోరీ చేసుకెళ్లడం జిల్లాలో ఇదే ప్రథమమని చెప్పవచ్చు. దీంతో కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. చోరీ వెలుగులోకి వచ్చిన 28వ తేదీ నుంచి పోలీసు అధికారులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. కేసును త్వరగా ఛేదించాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తోంది. దీంతో డీఐజీ, ఎస్పీ రోజూ పర్యవేక్షిస్తున్నారు. డీఎస్పీ మహేష్‌ బ్యాంకుతోపాటు పరిసరాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. తూమకుంట చెక్‌పోస్టు నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రధాన రహదారిలో సుమారు 40కి.మీ. దూరంగా రోడ్డుపక్కనున్న సీసీ టీవీ ఫుటేజీని చూస్తున్రాఉ. హిందూపురం, లేపాక్షి, మడకశిర, పెనుకొండ, తుమకూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి ముందు అలాంటి వ్యక్తులు బ్యాంకులోకి వచ్చి, వెళ్లారా అనే కోణంలో ఆరాతీస్తున్నారు. రెక్కీ నిర్వహించిన తరువాతే ఇంతపెద్ద చోరీ చేస్తారని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు ఎటువైపు నుంచి వచ్చారో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. వారు ఎలాంటి వాహనాలు ఉపయోగించారు అన్నది సీసీ టీవీ ఫుటేజీలో దొరక్కపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. నెలరోజుల సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ తరహాలో చోరీ చేసిన ప్రాంతాలను గుర్తించి అక్కడి పోలీసులను ఆరాతీస్తున్నారు.

నాలుగు రాష్ట్రాలకు బృందాలు..

బ్యాంకు చోరీ కేసును ఛేదించేందుకు గతనెల 28న ఆరు బృందాలను మూడు రాష్ట్రాలకు పంపారు. మరో రెండు బృందాలు ఇంకో రాష్ట్రానికి వెళ్లాయి. మరికొంతమంది పోలీసులు ఇక్కడే ఉండి వారికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. ఇందులో కర్ణాటక, తమిళనాడు ఢిల్లీ, ఒడిశా, అసోం రాష్ట్రాల్లో ఆరాతీస్తున్నట్లు సమాచారం. చోరీకి వచ్చిన నిందితుడు అలార్మ్‌ వైర్లు కత్తిరించే సమయంలో సీసీ కెమెరాలో రికార్డయిన ఫొటోలను ఇతర రాష్ట్రాల పోలీసులకు పంపించారు. ఈ తరహా వ్యక్తి ఏ రాష్ట్రంవారో కనుక్కునే పనిలో నిమగ్నమయ్యారు. మొదట ఏ రాష్ట్రానికి చెందినవాడో గుర్తిస్తే అతడిని పట్టుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి కేసుపై ఒత్తిడి పెరగడంతో రోజు రోజుకు పోలీసుల్లో టెన్షన పుంజుకుంటుంది. దీనిపై డీఎస్పీ మహే్‌షను మంగళవారం అడగ్గా.. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారం దొరకలేదన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లిన బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 01:49 AM