గర్భిణి ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్ట్
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:05 AM
అదనపు కట్నం వేధింపులతోనే గర్భిణి శ్రావణి (22) ఆత్మహత్య చేసుకుందని కళ్యాణదుర్గం పట్టణ సీఐ యువరాజు తెలిపారు. ఇందుకు కారకులైన భర్త బోయ శ్రీనివాసులు, అత్తమామలు బోయ కరియమ్మ, బోయ శివప్పను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కళ్యాణదుర్గం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): అదనపు కట్నం వేధింపులతోనే గర్భిణి శ్రావణి (22) ఆత్మహత్య చేసుకుందని కళ్యాణదుర్గం పట్టణ సీఐ యువరాజు తెలిపారు. ఇందుకు కారకులైన భర్త బోయ శ్రీనివాసులు, అత్తమామలు బోయ కరియమ్మ, బోయ శివప్పను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు శనివారం పట్టణ సీఐ యువరాజు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన బోయ శ్రీనివాసులుకు, ఇదే పట్టణానికి చెందిన తలారి శ్రావణితో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండు సంవత్సరాల పరిణీత కుమార్తె వుంది. అదనపు కట్నం తీసుకురావాలని తరచూ భర్త శ్రీనివాసులు, అత్తమామలు కరియమ్మ, శివప్ప మానసికంగా, శారీరకంగా శ్రావణిని ఇబ్బందులు పెట్టేవారు. చివరికి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ చేసినప్పటికీ సమస్య సద్దుమణగలేదు. రోజురోజుకీ అదనపు కట్నం వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన శ్రావణి పట్టణంలో వున్న తన పుట్టింటిలోనే ఈ నెల 14న ఇంటి పైకప్పునకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో భర్త, అత్తమామలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్లు సీఐ తెలిపారు.
పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ
శ్రావణి చనిపోయే ముందు మూడు నెలల గర్భవతిగా వుంది. ఆమె చనిపోయే ముందు తన చావుకు పోలీసులు, భర్త, అత్త,మామల వేధింపులే కారణమని వాయిస్ రికార్డుతో సోషల్ మీడియాలో వైరల్ చేయడం కలకలం రేపింది. తనను భర్త, అత్తమామలు వేధిస్తున్నారని ఈ నెల 11న పట్టణ పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నారు. న్యాయం చేయాల్సిన పోలీసులు పట్టించుకోలేదన్న ఆవేదనతో ఈ నెల 14న బలవన్మరణానికి పాల్పడింది. నిండు ప్రాణం పోయాక మేల్కొని భర్త, అత్తమామలను అరెస్టు చేసిన పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఫిర్యాదు చేసిన రోజే పోలీసులు స్పందించి భరోసానిచ్చి వుంటే ఒక నిండు ప్రాణం బలయ్యేదికాదని చర్చించుకుంటున్నారు. పోలీసులపై ఎస్పీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.