Arbitrary యథేచ్ఛగా ప్రభుత్వ భూములు కబ్జా
ABN , Publish Date - May 22 , 2025 | 11:53 PM
మండలంలో ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. అయినా రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తోందే తప్ప.. అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు
తనకల్లు, మే 22(ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. అయినా రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తోందే తప్ప.. అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. మండలంలోని బొంతలపల్లి రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 182లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోంది. సత్యసాయి జిల్లాలో తనకల్లు మండల సరిహద్దుగా అన్నమయ్య జిల్లాలోని ములకచెరువులు మండలం ఉంది. ములకలచెరువు మండల కేంద్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ములకలచెరువు మండల కేంద్రానికి సమీపంలోనే తనకల్లు మండలంలోని బొంతపల్లి రెవెన్యూ భూములున్నాయి. ఈ భూములను యథేచ్ఛగా అన్నమయ్య జిల్లా వాసులు ఆక్రమించి.. పక్కాగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ములకలచెరువులో టమోటా మండీలు అధికంగా ఉన్నాయి. తనకల్లు మండలంలోని చీకటిమానుపల్లి, బొంతపల్లి, టి.సదుం తదితర గ్రామాల నుంచి చాలా మంది నిరుపేదలు నిత్యం ములకలచెరువుకు పనుల కోసం వెళ్తుంటారు. ఇతర ప్రాం తాల నుంచి వచ్చిన కూలీలు అక్కడ అద్దె ఇళ్లలో ఉంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఇళ్లకు, స్థలాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో బొంతపల్లి రెవెన్యూ భూములను కబ్జా చేసి ... అం దులో రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపడుతున్నా రు. రెవెన్యూ అధికారులు మామూళ్లు మత్తులో మునగడం వల్లే ములకలచెరువు మండల వా సులను అడ్డుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఆ స్థలంలో తమకు పట్టాలు ఇవ్వాలని మండలంలోని అర్హులు పలుమార్లు అధికారులను కోరినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల తనకల్లు మండలానికి చెందిన నిరుపేదలు సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు పాతి ... ఇళ్లపట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు అదిగో.. ఇదిగో.. అని కాలక్షేపం చేస్తున్నారే తప్పా ... పట్టాలు ఇవ్వడం లేదు.