Share News

ప్రత్యామ్నాయంపై నిర్లక్ష్యం

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:03 AM

జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖరీ్‌ఫలో వేరుశనగ, ఇతర పంటలు సాగు చేయలేని రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రత్యామ్నాయంపై నిర్లక్ష్యం
ఆత్మకూరు మండలంలో ప్రత్యామ్నాయ సాగుకు సిద్ధంగా ఉన్న పొలం

పక్షం రోజుల కిందటే ప్రతిపాదనలు

గత ఏడాది ఇదే సమయానికి సబ్సిడీ ధరలు ఖరారు

విస్తారంగా వర్షాలతో ప్రత్యామ్నాయ సాగుకు సన్నద్ధం

సబ్సిడీ విత్తనాల కోసం రైతుల ఎదురుచూపు

అనంతపురం అర్బన, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖరీ్‌ఫలో వేరుశనగ, ఇతర పంటలు సాగు చేయలేని రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం విమర్ళలకు తావిస్తోంది. ఈ ఏడాది ఖరీ్‌ఫలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆశించిన స్థాయిలో పంటలు సాగు కాలేదు. దీంతో జిల్లాకు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అవసరమని జిల్లా వ్యవసాయ శాఖ రాష్ట్ర కమిషనరేట్‌కు పక్షం రోజుల క్రితమే ప్రతిపాదనలు పంపింది. పొలాల్లో పదును ఆరగానే విత్తనం వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాల కోసం సన్న, చిన్నకారు రైతులు నిరీక్షిస్తున్నారు.

ఈ సారి అరకొరగానే సాగు

ఈ ఏడాది ఖరీ్‌ఫలో జిల్లా సరాసరి సాధారణ సాగు విస్తీర్ణం 3.43 లక్షల హెక్టార్లులుగా నిర్ణయించారు. ఇందులో వేరుశనగ 1.82 లక్షల హెక్టార్లు, కంది 55,296, పత్తి 44వేలు, ఆముదం 16,293, వరి 19,466, జొన్న 1719, సజ్జ 2054, మొక్కజొన్న 14,653, రాగి 69, కొర్ర 3,311, పెసలు 455 హెక్టార్లు. మిగతా విస్తీర్ణంలో ఉలవలు, మినుములు, అలసంద తదితర రకాల పంటలు ఉన్నాయి. ఈ సారి ఆశించిన స్థాయిలో వానలు పడకపోవడంతో అరకొరగానే పంటలు సాగయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి దాకా 1.81 లక్షల హెక్టార్లల్లో (53 శాతం) మాత్రమే వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వేరుశనగ 59వేల హెక్టార్లల్లో మాత్రమే సాగయింది. మిగతా విస్తీర్ణంలో కంది, మొక్కజొన్న, ఆముదం, పత్తి, సజ్జల పంటలు సాగు చేశారు.

పక్షం రోజుల క్రితమే ప్రతిపాదనలు

ఈసారి ఖరీ్‌పలో వర్షాభావ పరిస్థితుల్లో ప్రధాన పంటలు ఆశించిన స్థాయిలో సాగు కాలేదు. ఈ నేపథ్యంలో గత పక్షం రోజుల క్రితమే జిల్లా వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ విత్తనాల కోసం ప్రతిపాదనలు పంపింది. జిల్లాలో 48,240 హెక్టార్లల్లో ప్రత్యామ్నాయ విత్తనాలు సాగు చేసేందుకు 9,245 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రతిపాదనలు పంపారు. ఇందులో ఉలవలు 5,945 క్వింటాళ్లు, పెసలు 1504, అలసంద 1050, కొర్ర 262, జొన్నలు 484 క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Updated Date - Aug 17 , 2025 | 12:03 AM