Share News

రక్తమోడిన రోడ్లు

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:25 AM

ఉమ్మడి జిల్లాలో వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. కొత్తచెరువు మండలంలోని మైలేపల్లి వద్ద ధర్మవరం ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. సీఐ మారుతీశంకర్‌ తెలిపిన మేరకు...ధర్మవరం పట్టణానికి చెందిన మంజునాథ్‌(22) ద్విచక్ర వాహనంలో కొత్తచెరువులో వివాహానికి హాజరై తిరిగి వెళుతున్నాడు.

రక్తమోడిన రోడ్లు

కొత్తచెరువు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. కొత్తచెరువు మండలంలోని మైలేపల్లి వద్ద ధర్మవరం ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. సీఐ మారుతీశంకర్‌ తెలిపిన మేరకు...ధర్మవరం పట్టణానికి చెందిన మంజునాథ్‌(22) ద్విచక్ర వాహనంలో కొత్తచెరువులో వివాహానికి హాజరై తిరిగి వెళుతున్నాడు. వేములేటికి చెందిన కొడపగానిపల్లి ఉపసర్పంచ చెరువుకోళ్ల నాగరాజు(48) పని నిమిత్తం టీవీఎ్‌స ఎక్స్‌ఎల్‌లో కొత్తచెరువుకు బయలుదేరాడు. మార్గమధ్యంలోని మైలేపల్లి వద్దకు రాగానే రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాగరాజు కాలు పూర్తిగా విరిగిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన మంజునాథ్‌ను 108లో కొత్తచెరువు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ మంజునాథ్‌ను పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్దారించారు. సీఐ మారుతీశంకర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నాగరాజుకు భార్య రామాంజినమ్మ, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. మంజునాథ్‌ కుంకాలు అమ్ముకుంటూ తల్లిదండ్రులు సూరమ్మ, గోవిందుకు తోడుగా ఉండేవాడు. మంజునాథ్‌కు వివాహం కాలేదు.

లారీని ఆటో ఢీకొని మరొకరు..

నల్లచెరువు : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన మేరకు.. పాత రైల్వేస్టేషన సమీపంలో జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి, ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎస్‌. షాకీర్‌ (39) తీవ్రంగా గాయపడ్డాడు. 108లో అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంతో మృతి చెందాడు. కె.పూలకుంటకు చెందిన ఎస్‌.షాకీర్‌ ప్రతిరోజూ కూరగాయలు, ఇతర సరుకులు విక్రయిస్తుంటాడు. ఆదివారం ఉదయం కదిరిలో కూరగాయలు కొనుగోలుచేయడానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. మృతుడి భార్య మస్తానబీ కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమార్తెలను పోషించుకుంటోంది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

ద్విచక్ర వాహనం ఢీకొని బాలుడు..

గుమ్మఘట్ట: మండలంలోని బేలోడు గ్రామం వద్ద వేగంగా వెళ్లిన ఓ ద్విచక్ర వాహనం బాలుడిని బలితీసుకుంది. ద్విచక్రవాహనం వేగంగా వెళుతూ రోడ్డు పక్కన ఆడుకుంటున్న బాలుడిని ఢీ కొనడంతో దుర్మరణం పాలైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ వీరాంజి, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు కార్తీక్‌(5) రెండు నెలల క్రితం ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో చేరాడు. గ్రామ సమీపంలోని తమ వ్యవసాయ పొలం వద్ద తల్లిదండ్రులు పనులు చేసుకుంటున్నారు. కార్తీక్‌ రోడ్డు పక్కన ఆడుకుంటుండగా గ్రామానికి చెందిన యువకుడు శేఖర్‌ రంగచేడు గ్రామం నుంచి బేలోడుకు ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతూ బాలుడిని ఢీ కొని పది మీటర్ల వరకు ఈడ్చికె ళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన బాలుడి కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు కేకలు వేయగా వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. పసిబాలుడు వాహనం కిందపడి చనిపోతే కనీసం ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు మూకుమ్మడిగా శేఖర్‌ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలియగానే రాయదుర్గం సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ ఈశ్వరయ్య సిబ్బందితో గ్రామానికి చేరుకొని బాలుడి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకటరమణ తెలిపారు.

గ్రామంలో బందోబస్తు

బేలోడు గ్రామంలో ఆదివారం బాలుడి ప్రమాద సంఘటన నేపథ్యంలో సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ ఈశ్వరయ్య, పోలీసు సిబ్బందితో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడేళ్ల క్రితం గ్రామంలో మొహరం సందర్భంగా దళితులు, వాల్మీకులకు మధ్య గొడవ నేపథ్యంలో అప్పట్లో ఎస్సీలు, వాల్మీకులు 25 మందిపై కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పి వేధించారు. ప్రస్తుతం బాలుడి ప్రమాద సంఘటన ఎస్సీలకు చెందిన యువకుడు బాధితుడు కావడంతో వాల్మీకులు ఆగ్రహంతో దళితులపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తారని ముందు జాగ్రత్తగా పోలీసులు గ్రామంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Aug 18 , 2025 | 12:25 AM