బావిపౌరులకు బహుదూరం..!
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:48 PM
మండలంలోని ఎర్రగుడి గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఆ గ్రామ విద్యార్థులు ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే .. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బెళుగుప్పకు వెళ్లాల్సిందే. ఈ గ్రామానికి బస్సు సౌకర్యమూ లేదు
బెళుగుప్ప, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎర్రగుడి గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఆ గ్రామ విద్యార్థులు ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే .. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బెళుగుప్పకు వెళ్లాల్సిందే. ఈ గ్రామానికి బస్సు సౌకర్యమూ లేదు. దీంతో ఈ గ్రామానికి చెందిన సూమారు 30 మంది విద్యార్థులు రోజూ ఉన్నత పాఠశాలకు పోను .. రాను .. మొత్తం పది కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. ఆటోలో రూ. 10 వసూలు చేస్తారు. అంటే రోజుకు రూ. 20 ఖర్చు పెట్టలేని పేద విద్యార్థులు రోజూ ఉన్నత పాఠశాలకు ఇలా నడుచుకొంటు వెళ్లి.. వస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తుండటంతో.. వారికి పాఠశాల సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తోంది. ఆ సమయంలో బాలికలు.. నడుచుకొంటూ స్వగ్రామానికి వెళ్తున్నారు. కాగా ఎర్రగుడి డీవైఈవో మల్లారెడ్డి స్వగ్రామం. ఈ గ్రామానికి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని బస్సు సౌకర్యం కల్పించేలా.. లేదా కనీసం సైకిళ్లు ఇచ్చేలా అధికారులు.. పాలకులు చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.