Share News

ఫోనలో ఉగ్ర గుట్టు..!

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:40 AM

పాకిస్థానకు నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు నెరిపిన కొత్వాల్‌ నూర్‌ మహమ్మద్‌ అరెస్టుతో జిల్లాలో కలకలం రేగింది. అతడి ఫోనను ఫోరెన్సిక్‌కు పంపారు. అందులో ఉగ్ర లింకులు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ధర్మవరంలోని లోనికోట ప్రాంతానికి చెందిన నూర్‌ మహహ్మద్‌ పాకిస్థానకు చెందిన నిషేధిత ఉగ్రవాద వాట్సాప్‌ గ్రూపుల్లో చురుగ్గా ఉంటూ ..

ఫోనలో ఉగ్ర గుట్టు..!
Noor Mohammed talking to his girlfriend from Tadipatri

నూర్‌ మహమ్మద్‌ మొబైల్‌లో వివరాలు బయటపడే అవకాశం

ఉగ్రసంస్థ పిలిస్తే శిక్షణకు రెడీ

అజ్ఞాతంలోకి ప్రియురాలు

అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు

జిల్లాపై పూర్తి నిఘా

పుట్టపర్తి/ధర్మవరం/హిందూపురం, ఆగస్టు 17(ఆంద్రజ్యోతి): పాకిస్థానకు నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు నెరిపిన కొత్వాల్‌ నూర్‌ మహమ్మద్‌ అరెస్టుతో జిల్లాలో కలకలం రేగింది. అతడి ఫోనను ఫోరెన్సిక్‌కు పంపారు. అందులో ఉగ్ర లింకులు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ధర్మవరంలోని లోనికోట ప్రాంతానికి చెందిన నూర్‌ మహహ్మద్‌ పాకిస్థానకు చెందిన నిషేధిత ఉగ్రవాద వాట్సాప్‌ గ్రూపుల్లో చురుగ్గా ఉంటూ ఉగ్రవాద భావజాలం, దేశవ్యతిరేక ప్రచారం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఉగ్రగ్రూపులతోపాటు పాకిస్థాన నిషేధిత వాట్సాప్‌ గ్రూపుల్లో వచ్చిన సమాచారాన్ని డౌనలోడ్‌ చేసి, ప్రచురించి ధర్మవరంతోపాటు జిల్లాలోని పలు మసీదులు, ప్రార్థనా మందిరాల వద్ద యువతకు పంచిపెట్టినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఉగ్రవాద సంస్థలతో ఆర్థిక లావాదీవీలు సైతం సాగించినట్లు తెలుస్తోంది. ఇక్కడి సమాచారాన్ని ఉగ్రవాద సంస్థలకు చేరవేసేవాడని సమాచారం. ఏదైనా ఉగ్ర సంస్థ పిలిస్తే శిక్షణ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. నూర్‌ మహమ్మద్‌కు ఉగ్రవాద గూపులతో సంబంధం ఎలా ఏర్పడింది, అందుకు ఎవరు సహకరించారు, ఉగ్రవాద గ్రూపుల నుంచి డౌనలోడ్‌ చేసుకున్న సమాచారాన్ని ఎవరెవరికి


పంపించాడు అన్న కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ఈనేపథ్యంలో కడప సెంట్రల్‌ జైలులో ఉన్న నూర్‌ను కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ధర్మవరంలో ఎర్రగుంటకు చెందిన రియాజ్‌ అనే యువకుడు పాకిస్థాన జాతీయ జెండాతోపాటు సయ్యద్‌ బిలాల్‌ వీడియోలను వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టుకోవడాన్ని నిఘావర్గాలు గుర్తించాయి. శనివారం రియాజ్‌ను అదుపులోకి తీసుకుని, విచారించి వదిలిపెట్టిన సంగతి తెలిసిందే. ధర్మవరంతోపాటు హిందూపురం, కదిరి ప్రాంతాల్లో ఇలాంటి వాట్సాప్‌ స్టేట్‌సలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఓవైపు నూర్‌ మమహ్మద్‌ ఉగ్రలింకులపై దర్యాప్తు చేస్తూనూ.. మరోవైపు జిల్లా వాప్తంగా ఉగ్రకదలికలపై పోలీసు యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాలో అనుమానం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టారు.

మొబైల్‌లో నూర్‌ ఉగ్రలింకుల గుట్టు

నూర్‌ మహమ్మద్‌ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌లో ఉగ్రలింకుల గుట్టు వెల్లడికానుందని పోలీసులు భావిస్తున్నారు. ఆరు ఉగ్రవాద సంస్థలు, 30 పాకిస్థాన గ్రూపుల్లో నూర్‌ మహమ్మద్‌ చురుగ్గా ఉన్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూచింది. స్వాధీనం చేసుకున్న రెండు సిమ్‌కార్డులతోపాటు మొబైల్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. మొబైల్‌తో ఎవరెవరికి కాల్‌ చేశారు, ఎక్కడెక్కడి నుంచి కాల్స్‌ వచ్చా యి, నూర్‌ యాక్టివ్‌గా ఉన్న ఉగ్ర గ్రూపుల అడ్మిన్లు ఎవరు, ఏమి సందేశాలు పంపారన్న అంశాలు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికలో వెల్లడికానున్నాయి. ధర్మవరంలో నూర్‌తోపాటు ఇంకా ఎవరెవరికి లిం కులు ఉన్నాయో వెల్లడయ్యే అవకాశాలున్నాయి. వారి భవిష్యత్తు కార్యాచరణ ఏమిటన్నది కూడా తేలియవచ్చని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

అక్కడే పరిచయం ఏర్పడిందా?

నూర్‌ మహమ్మద్‌ రెండేళ్ల క్రితం అన్నమయ్య, కడప జిల్లాల్లో నిర్వహించిన ఇజితిమా కార్యక్రమాలకు వెళ్లిన సమయంలో అక్కడ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నవారు పరిచయమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పటి నుంచి ఉగ్రవా ద సంబంధాలున్న వారితో పరిచయాలు పెరగడం తో తరచూ ఫోన, వాట్సాప్‌ ద్వారా చాటింగ్‌ చేస్తుండేవాడని తెలిసింది. ఇలా ఉగ్ర సంస్థలతో పూర్తిగా మమేకమయ్యాడని భావిస్తున్నారు. స్థానికంగా మసీదుల వద్ద ముస్లిం యువతను.. ఉగ్రవాదం వైపు ప్రేరేపించేవాడని అనుమానిస్తున్నారు.

ప్రియురాలి కోసం ఆరా..

నూర్‌ మహమ్మద్‌ కొంతకాలంగా తాడిపత్రికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం నడుపుతున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. దర్యాప్తు బృందాలు ఆ కోణంలో కూడా విచారణ చేపట్టాయి. అతడి ప్రియురాలి పూర్వాపరాల గురించి ఆరాతీస్తున్నట్లు తెలిసింది. ఆమెకు నిషేధిత ఉగ్రసంస్థలతో సంబంధాలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాయి. నూర్‌మహమ్మద్‌ అరెస్టుతో ప్రియురాలు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. నూర్‌మహమ్మద్‌ తరచూ వాట్సాప్‌ కాల్‌ ద్వారా ప్రియురాలితో సంభాషించిన ఆధారాలను కుటుంబసభ్యులు బహిర్గతం చేశారు. దర్యాప్తు బృందాలు.. ఆమెను అదుపులోకి తీసుకుంటే మరిన్ని వివరాలు బయటపడే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

ధర్మవరంలో ఆందోళన

పట్టుచీరలకు పేరొందిన ధర్మవరంలో ఉగ్రకదలికలు బయటపడటంతో పట్టణ ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇలాంటి వారు ఇంకా ఎంతమంది ఉన్నారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో చేనేత రంగం వృద్ధిచెందుతున్న తరణంలో ఈ ఉగ్ర కదలికల ఉదంతం ఆ వ్యాపార రంగంపై ప్రభావం చూపవచ్చనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి ప్రత్యేక బృందాల ద్వారా మరింత లోతుగా దర్యాప్తు చేయించి ధర్మవరంలో ఉగ్రకదలికలు వెలికితీసి కఠినంగా వ్యవహరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

జిల్లావ్యాప్తంగా నిఘా

నూర్‌ మహమ్మద్‌ అరెస్టుతో రాష్ట్ర నిఘా విభాగం ఉగ్ర మూలాలను జల్లెడ పట్టాలని పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అనుమానిత ప్రదేశాల్లో నిఘా ముమ్మరం చేసింది. జిల్లాలోని అనుమానిత ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా ఇటీవల కాలంలో వచ్చారా అనే దానిపై రహస్యంగా ఆరాతీస్తున్నారు. ఉగ్రవాద లింకులున్న వ్యక్తులు పట్టణాల్లో ఉంటూ వారిపై ఉగ్రవాద వల విసురుతున్నట్లు తెలుస్తుంది. జిల్లా సరిహద్దులో ఉన్న హిందూపురం, కదిరి, ధర్మవరం, మరికొన్ని పట్టణాల్లో స్థానిక పోలీసు అధికారులు నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బెంగళూరు దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతాల్లోకి వచ్చి కొన్నిరోజులపాటు స్థిరపడి బెంగళూరుపై గురిపెట్టే అవకాశాలు లేకపోలేదు. దీంతో జిల్లా సరిహద్దులో ఉన్న పోలీసు అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Aug 18 , 2025 | 12:51 AM