పంటకు ఊట దెబ్బ
ABN , Publish Date - Dec 26 , 2025 | 11:37 PM
పొలంలో ఊట నీటి వల్ల ఎనిమిదేళ్లుగా వ్యవసాయానికి దూరమై ఓ రైతు ఇబ్బందులు పడుతున్నాడు. పట్టణానికి చెందిన రైతు షేక్ అబ్దుల్ సలాంకు కసాపురం గ్రామ శివారులో సర్వే నెంబరు 424-బీలో 6.69 ఎకరాల భూమి ఉంది
గుంతకల్లుటౌన, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): పొలంలో ఊట నీటి వల్ల ఎనిమిదేళ్లుగా వ్యవసాయానికి దూరమై ఓ రైతు ఇబ్బందులు పడుతున్నాడు. పట్టణానికి చెందిన రైతు షేక్ అబ్దుల్ సలాంకు కసాపురం గ్రామ శివారులో సర్వే నెంబరు 424-బీలో 6.69 ఎకరాల భూమి ఉంది. పొలం పక్కన హంద్రీనీవా పిల్ల కాలువ నుంచి కృష్ణా జలాలు వెళ్తుతున్నాయి. కాలువ కోసం ఒక ఎకరా భూమిని వదిలేశాడు. నీళ్లు వస్తాయని మొదట సంతోషం వ్యక్తం చేశాడు. ఎనిమిదేళ్ల క్రితం వరి పంటను సాగుచేశాడు. అయితే తన పొలంలో ఊట నుంచి భారీగా నీరు వస్తుండటంతో పంట మొత్తం పూర్తిగా దెబ్బతింది. అప్పటి నుంచి పొలం గడ్డి, జంబుతో నిండిపోయింది. ఈ సమస్యను కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ దృష్టికి తీసుకొనివెళ్లినా.. ఎవరూ పట్టించుకోలేదు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్పందించి హంద్రీనీవా అధికారులతో మాట్లాడి పొలంలోకి నీరు రాకుండా ఎత్తుగా మట్టి కట్ట వేయించాడు. అయినా ఊట నీరు ఆగలేదు. కాలువ తన భూమి సమాంతరంగా ఉండటంతో ఈ సమస్య వస్తోందని, కాలువను రెండు అడుగులు లోతు తవ్వి సిమెంట్‌తో పనులు చేయిస్తే.. ఊట సమస్య పరిష్కారమవుతుందని, లేకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని రైతు షేక్ అబ్దుల్ సలాం వాపోతున్నాడు.