Governor Abdul Nazir: ప్లాస్టిక్ రహితంగా అమరావతి
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:20 AM
అమరావతిని ప్లాస్టిక్ రహిత రాజధాని నగరంగా మార్చడమే మన దీర్ఘకాలిక లక్ష్యం కావాలని రాష్ట్ర గవర్నర్..
దేశానికే దిక్సూచిగా రాజధాని నగరం మారాలి
‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై యుద్ధం’ కార్యక్రమంలో గవర్నర్ నజీర్
గుంటూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): అమరావతిని ప్లాస్టిక్ రహిత రాజధాని నగరంగా మార్చడమే మన దీర్ఘకాలిక లక్ష్యం కావాలని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తెలిపారు. గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై యుద్ధం’ అనే కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అమరావతి ప్రతిబింబిస్తుందని తెలిపారు. పర్యావరణ అనుకూల అభివృద్ధిలో అమరావతి దేశానికే రోల్‌మోడల్ కావాలని ఆకాంక్షించారు. పరిశుభ్రమైన, స్థిరమైన, ప్లాస్టిక్ రహిత అమరావతి సాధించడమే కాదు.. అది మనందరికీ చాలా అవసరమన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ‘ఆంధ్రప్రదేశ్ వాతావరణ కార్యాచరణ, అమరావతి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈ ప్రచారం సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌పై యుద్ధం కానుందని, ఈ ప్రచారం ప్రజల భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుందన్నారు. భవిష్యత్తు తరాల కోసం ప్రచారానికి యువత నాయకత్వం వహించాలని తాను కోరుకుంటున్నానని గవర్నర్ తెలిపారు.