Share News

Gita Workers : గీత కులాలకు 340 మద్యం షాపులు

ABN , Publish Date - Jan 17 , 2025 | 04:27 AM

మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గీత కులాలకు 340 మద్యం షాపులు కేటాయించాలని నిర్ణయించింది. ఉపకులాల వారీగా వారం రోజుల్లో వీటికి నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. తొలుత గీత కార్మికుల ఆధారంగా షాపులు కేటాయించాలని

Gita Workers : గీత కులాలకు  340 మద్యం షాపులు

జిల్లాల వారీగా జాబితాలు సిద్ధం

వారంలో నోటిఫికేషన్‌ జారీకి ఏర్పాట్లు

అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గీత కులాలకు 340 మద్యం షాపులు కేటాయించాలని నిర్ణయించింది. ఉపకులాల వారీగా వారం రోజుల్లో వీటికి నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. తొలుత గీత కార్మికుల ఆధారంగా షాపులు కేటాయించాలని భావించగా, ఆ తర్వాత గీత కులాల వారీగా షాపుల కేటాయింపునకు నిర్ణయం తీసుకుంది. గత అక్టోబరులో అమల్లోకి తీసుకొచ్చిన ప్రైవేటు మద్యం షాపుల పాలసీలో 3,396 షాపులకు లైసెన్సులు జారీచేశారు. అందులో 10శాతం ఇప్పుడు గీత కులాలకు ఇవ్వనున్నారు. అలా వచ్చే 340 షాపుల్లో నాలుగు షాపులు సొండి కులానికి విడిగా కేటాయిస్తారు. గతంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన కుటుంబానికి ఒక షాపును కేటాయించనున్నారు. మిగిలిన 335 షాపులకు నోటిఫికేషన్‌ జారీచేస్తారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. దరఖాస్తు రుసుము రూ.2లక్షలుగా ఉంది. అయితే లైసెన్స్‌ ఫీజులు సగం చెల్లిస్తే సరిపోతుంది.


జిల్లాల వారీగా గీత కులాల జనాభా ఆధారంగా ఏ జిల్లాకు ఎన్ని షాపులు వస్తాయనే వివరాలు ఎక్సైజ్‌ శాఖ సేకరించింది. 2016లో చేసిన స్మార్ట్‌ పల్స్‌ సర్వేని కులాల జనాభాకు ప్రామాణికంగా తీసుకున్నారు. గీత కులాలను మూడు కేటగిరీలు చేశారు. ఎ-కేటగిరీలో యాత, బి-కేటగిరీలో గౌడ, ఈడిగ, గౌడ(గమళ్ల), కలాలీ, గౌండ్ల, శ్రీసాయన, సొండి, శెట్టిబలిజ కులాలున్నాయి. మరో కేటగిరీలో సొండి కులాన్ని విడిగా చూపించారు. ఆయా జిల్లాల్లో ఆ కులానికి ఉన్న జనాభా ఆధారంగా షాపులు నిర్ణయించారు. తిరుపతి జిల్లాలో అత్యధికంగా 23 షాపులు గీత కులాలకు కేటాయించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక్కటీ లేదు. అనంతపురంలో 14, శ్రీసత్యసాయిలో 9, అన్నమయ్యలో 11, చిత్తూరులో 10, తూర్పుగోదావరిలో 13, కాకినాడలో 16, కోనసీమలో 13, బాపట్లలో 12, గుంటూరులో 13, పల్నాడులో 13, కడపలో 14, కృష్ణాలో 12, ఎన్టీఆర్‌లో 11, కర్నూలులో 10, నంద్యాలలో 11, నెల్లూరులో 18, ప్రకాశంలో 18, పార్వతీపురం మన్యంలో 4, శ్రీకాకుళంలో 18, అనకాపల్లిలో 15, విశాఖపట్నంలో 14, విజయనగరంలో 16, ఏలూరులో 14, పశ్చిమగోదావరిలో 18 షాపులు గీత కులాలకు కేటాయించనున్నారు.

సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు

గీత కార్మికులు, కులాలకు షాపుల కేటాయింపుపై ఎవరికీ అభ్యంతరాలు లేవు. కానీ లైసెన్స్‌ ఫీజు సగమే ఉండటంపై మాత్రం ఇతర మద్యం షాపుల లైసెన్సీల నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. లైసెన్స్‌ ఫీజు సగమే కావడంతో గీత కులాల వారి వ్యాపారం లాభసాటిగా ఉంటుందనేది సాధారణ లైసెన్సీల అభిప్రాయం. అయితే వ్యాపారుల మధ్య విభేదాలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎక్సైజ్‌ శాఖ చెబుతోంది.

Updated Date - Jan 17 , 2025 | 04:27 AM