Share News

CID Controversy: సునీల్‌ కుమార్‌పై ఏసీబీకి లేఖ రాస్తా

ABN , Publish Date - Feb 13 , 2025 | 04:35 AM

న్యాయవాది కాని వ్యక్తికి భారీగా నగదు చెల్లించిన వ్యవహారంలో సీఐడీ అదనపు మాజీ డీజీ పీవీ సునీల్‌ కుమార్‌పై న్యాయ విచారణ కోరుతూ ఏసీబీకి లేఖ రాయనున్నట్టు డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు వెల్లడించారు.

CID Controversy: సునీల్‌ కుమార్‌పై ఏసీబీకి లేఖ రాస్తా

న్యాయవాది కాని తులసిబాబుకు నగదు చెల్లింపుపై విచారణ కోరతా

ఖాళీగా కూర్చోబెట్టి జీతం ఇస్తున్నారు

రూ.కోట్లలో అవినీతికి పాల్పడ్డ సునీల్‌ను

ఎందుకు సస్పెండ్‌ చేయడం లేదు?: రఘురామ

కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో గుంటూరు కోర్టుకు డిప్యూటీ స్పీకర్‌

గుంటూరు, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): న్యాయవాది కాని వ్యక్తికి భారీగా నగదు చెల్లించిన వ్యవహారంలో సీఐడీ అదనపు మాజీ డీజీ పీవీ సునీల్‌ కుమార్‌పై న్యాయ విచారణ కోరుతూ ఏసీబీకి లేఖ రాయనున్నట్టు డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు వెల్లడించారు. కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు బుధవారం ఆయన గుంటూరులోని ఐదో జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుకు వచ్చారు. న్యాయమూర్తి కె.లత 164 సీఆర్‌పీసీ కింద ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. అనంతరం రఘురామ మీడియాతో మాట్లాడారు. ‘‘తులసిబాబు హైకోర్టులో, విజయ్‌పాల్‌ కింది కోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ విచారణకు వచ్చిన సందర్భంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సునీల్‌కుమార్‌, తులసిబాబుకు మధ్య ఉన్న అనుబంధం బయటపడింది. సునీల్‌ కుమార్‌ ప్రోద్బలంతో సీఐడీ కేసుల్లో న్యాయ సలహాదారుగా 2021 మేలో తులసిబాబును నియమించారు.


అప్పటికి తులసిబాబు న్యాయవాది కాదు. నాపై కస్టోడియల్‌ టార్చర్‌ జరిగిన తర్వాత, 2021 అక్టోబరులోగానీ ఆయన బార్‌ అసోసియేషన్‌లో ఎన్‌రోల్‌ చేయించుకోలేదు. హైకోర్టులో ట్రయల్‌ నడపడం కోసమే తులసిబాబును తీసుకున్నామని ఆయన నియామక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ, సీఐడీ కేసుల్లో హైకోర్టులో ట్రయల్‌ జరగదు. కింది కోర్టుల్లో అంటే జిల్లా కోర్టులోగాని, ట్రయల్‌ కోర్టుల్లో మాత్రమే జరుగుతుంది. అయినా తులసిబాబుకు గత జగన్‌ ప్రభుత్వం కోటి రూపాయలు చెల్లించింది’’ అని వివరించారు. న్యాయవాది కాని వ్యక్తిని న్యాయ సలహాదారుగా పెట్టుకోవడం తప్పని, ఇది అవినీతి కిందకే వస్తుందని రఘురామ తెలిపారు. దీనిపై విచారణ జరపాలని ఏసీబీకి లేఖ రాయబోతున్నానని తెలిపారు. సునీల్‌కుమార్‌ అవినీతిపై ఏసీబీ విచారణ కూడా మొదలైందని ‘ఆంధ్రజ్యోతి’లో చదివానని, అయినా ఆయనను ఎందుకు సస్పెండ్‌ చేయడం లేదో తెలియడం లేదన్నారు. ‘‘సునీల్‌కుమార్‌కు ఎటువంటి బాధ్యతలు ఇవ్వకుండా ఖాళీగా కూర్చోబెట్టి జీతం ఇస్తున్నారు. ఆయన దుబాయ్‌, అమెరికాల్లో తిరుగుతూ తన వ్యాపారాలు చక్కబెట్టుకుంటున్నారు. కనీసం కార్యాలయానికి వచ్చి సంతకం చేయమన్నా చేయడం లేదు. అయినా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.’’ అని పేర్కొన్నారు. ఐపీఎస్‌ అధికారి అయి ఉండి సునీల్‌కుమార్‌ అసోసియేషన్‌ పెట్టడం పెద్ద తప్పు అని రఘురామ అన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సభ పెడతానని సర్వీసులో ఉన్న ఒక అధికారిగా సునీల్‌ కుమార్‌ ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు.


జగన్‌ చెప్పేవన్నీ అబద్ధాలే..

జగన్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఆయన సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ‘‘సభలో 10 శాతం కంటే తక్కువగా సభ్యులు ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు. ఈ విషయంలో స్పీకర్‌కు కోర్టు సమన్లు ఇచ్చిందని జగన్‌ అబద్ధం చెప్పారు. కోర్టు స్పీకర్‌కు సమన్లు ఇవ్వలేదు. జగన్‌ బడ్జెట్‌ సమావేశాలకు రావాలి’’ అని రఘురామ వ్యాఖ్యానించారు. జగన్‌ వెంట్రుక పీకుతామో లేదోగానీ ఆయన పదవి ఉంటుందో పోతుందో చూద్దామంటూ.. ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన వ్యాఖ్యానించారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..

Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం

Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Also Read: మరోసారి కుల గణన సర్వే

Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు

Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 13 , 2025 | 04:35 AM