Share News

Union Favoritism: యూనియన్లదే హవా

ABN , Publish Date - May 28 , 2025 | 06:13 AM

వ్యవసాయ శాఖ బదిలీలలో యూనియన్ ఆఫీస్‌ బేరర్లకు ప్రాధాన్యం ఇచ్చి ఇతర ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని విమర్శలు ఎదురవుతున్నాయి. కొన్ని జోన్లలో కౌన్సెలింగ్‌ కమిటీలు సొంతంగా పోస్టులను కేటాయించటం, రిటెన్షన్‌ లో అవినీతి సంభవించడం ఉద్యోగుల లో అసంతృప్తి పెంచింది.

Union Favoritism: యూనియన్లదే హవా

నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు

వ్యవసాయ శాఖలో తీవ్ర గందరగోళం

మరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ శాఖ బదిలీల్లో యూనియన్లకే ప్రాధాన్యం దక్కిందని, ప్రభుత్వ మార్గదర్శకాలకు పట్టించుకోలేదని విమర్శలొస్తున్నాయి. నాలుగు జోన్లలో ఏఈవోలు, ఏవోలు, ఏడీఏల బదిలీలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఈ బదిలీల్లో కౌన్సెలింగ్‌ కమిటీలు ఇష్టమొచ్చినట్లు పోస్టులు కేటాయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగుల అసోసియేషన్‌లో ప్రెసిడెంట్‌, సెక్రటరీ, ట్రెజరర్‌లతోపాటు మరో ముగ్గురికే ఇవ్వాల్సిన రిటెన్షన్‌లు ఇతర ఆఫీస్‌ బేరర్స్‌కూ ఇచ్చారు. పైగా ఒక వర్గానికి చెందినవారికే ఈ అవకాశం లభించిందని అంటున్నారు. వాస్తవంగా ఉద్యోగ సంఘాల్లో ప్రైమ్‌ బాడీగా ఉండే ఆరుగురు ఆఫీస్‌ బేరర్స్‌కు 9ఏళ్లపాటు ఎక్కడివారు అక్కడే (రిటెన్షన్‌) ఉండే అవకాశం ఉండగా, కార్యవర్గంలో కొందరు ఇతర పదవులు చూపి, ఐదేళ్లు దాటినా రిటెన్షన్‌ కోరుకుంటే.. కౌన్సెలింగ్‌ కమిటీలు ఆమోదం తెలిపాయి. ఉపాధ్యక్ష, ఉపకార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, మహిళా సంఘం వంటి పదవులు చూపుతూ కొందరు బదిలీ కాకుండా చూసుకున్నారు. చాలా జిల్లాల్లో ఆఫీస్‌ బేరర్‌గా ఉన్నారా? అని కౌన్సెలింగ్‌ కమిటీలు ముందుగానే ఉద్యోగులను అడిగి, వారికి ఐదేళ్లు దాటినా రిటెన్షన్‌ ఇచ్చారని చెబుతున్నారు.


కానీ ఒక స్టేషన్‌లో ఐదేళ్లు పూర్తైన ఉద్యోగి మరోచోట పోస్టింగ్‌ కోరుకుంటే.... అక్కడ ఖాళీ లేదు, ఇక్కడ భర్తీ అయిపోయింది, మరోచోటికి వెళ్లండి.. అంటూ కమిటీనే బదిలీలు చేసేందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. గుంటూరు జిల్లాలో ఐదేళ్లు దాటినా.. ఆఫీస్‌ బేరర్స్‌గా ప్రాధాన్యం ఇచ్చి, బదిలీలకు అర్హులైన ఉద్యోగులకు అన్యాయం చేశారని, అభ్యర్థన పెట్టుకోకపోయినా.. సిఫారసు లేఖలతో బదిలీలు చేసేశారని చెప్తున్నారు. గుంటూరు జిల్లాలో సాయిల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌, పెస్టిసైడ్స్‌ కంట్రోల్‌ ల్యాబ్‌, బయోలాజికల్‌ కంట్రోల్‌ ల్యాబ్‌, ఫర్టిలైజర్‌ కంట్రోల్‌ ల్యాబ్‌ ఉన్నాయి. వీటిలో 20మంది ఏవోలు ఉండగా, ఐదేళ్లు దాటిన వారిని స్టేషన్‌ సీనియారిటీ కింద చూడకుండా, వారిలో కొందరికి ఫ్రీజోన్‌గా చూపిన గుంటూరులోని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో పోస్టులు కేటాయిస్తున్నారు. కొన్నిచోట్ల రెండు మూడు అసోసియేషన్లు ఉన్నట్టు చూపి, వారికి కూడా ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ప్రైమ్‌ బాడీ కింద ఆరుగురికి రిటెన్షన్‌ అవకాశం ఉండగా, జోన్‌-2(ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాలు)లో 18మందికి అవకాశం వస్తుంది. కానీ ఈ జోన్‌ 7 జిల్లాలు కావడంతో.. 42మందికి రిటెన్షన్‌ అవకాశం ఉండగా, ఈ జోన్‌లో 300మంది బదిలీలకు అవకాశం ఉంది. కానీ ఈ జోన్‌లో రెండు అసోసియేషన్లు ఉండటంతో, మూడింట ఒక వంతు పోస్టులు ఆఫీస్‌ బేరర్స్‌ కింద రిటెన్షన్‌కే పోయాయి. దీనివల్ల ఇతర ఉద్యోగులకు బదిలీ, కోరుకున్న పోస్టు రాకుండా పోతోందన్న వాదన ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 06:13 AM