రసాభాసగా సామాజిక తనిఖీ ప్రజా వేదిక
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:46 PM
మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత కార్యాలయ ఆవరణంలో శుక్రవారం జరిగిన సామాజిక తనిఖీ ప్రజా వేదిక రసాభాసగా సాగింది.

ఉపాధి నిధుల దుర్వినియోగంపై విచారణ
గృహ నిర్మాణ బిల్లుల్లో అవకతవకలు
రూ.1.30 లక్షల రికవరీకి ఆదేశం
ఉయ్యాలవాడ, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత కార్యాలయ ఆవరణంలో శుక్రవారం జరిగిన సామాజిక తనిఖీ ప్రజా వేదిక రసాభాసగా సాగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ ద్వారా రూ. 6.27 కోట్ల నిధులు ఖర్చు చేశారు. గత వారం రోజులుగా మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో సామాజిక తనిఖీ బృందం పర్యటించి పనులను పరిశీలించారు. మండలంలోని పలు గ్రామాల్లో గ్రీన అంబాజిటర్లకు, ఆయాలకు మస్టర్లు వేయటం, వలంటీర్లకు మూడు రోజుల కంటే ఎక్కువగా పనిదినాలు కల్పించినట్లు మస్టర్లు వేసి నిధులు దుర్వినియోగం చేశారని పరిశీలన అధికారి, ఏపీడీ బాలాజీనాయక్ గుర్తించారు. దీనిగాను రూ. 1,30,304 నిధులు దుర్వినియోగం అయినట్లు గుర్తించి సంబంధిత వ్యక్తుల నుంచి రికవరీ చేయాలని ఆదేశించారు. అలాగే సర్వాయిపల్లె గ్రామంలో పనిప్రదేశ గుర్తింపును సరిగా చూపకపోవడంపై ఉపాధి సిబ్బంది, తనిఖీ బృందం మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిగా గాను ఆ గ్రామ టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్‌అసిస్టెం టుకు క్రమ శిక్షణ చర్యల కింద రూ. 8 వేుల జరిమానా విధించారు. అలాగే తుడుమలదిన్నె గ్రామంలో 8 పాత గృహ నిర్మాణాలకు బిల్లులు చెల్లిం చినట్లు తనిఖీ బృందం గుర్తించింది. దీని సంబంధించి అధికారులు విచారణ జరపాలని ఆదేశించారు. కార్యక్రమంలో క్లస్టర్ ఏపీడీ సాంబశివరావు, ఎంపీడీవో ఉమమహేశ్వరరావు, క్యూసీ గంగాధర్‌రావు, ఎస్‌ఆర్పీ మురాద్, ఏపీవో రవిప్రకాష్ తదితరులు ఉన్నారు.