Air Services : విమానాశ్రయాలు కళకళ
ABN , Publish Date - Mar 07 , 2025 | 07:07 AM
తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాలు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) గురువారం విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

జనవరిలో భారీగా పెరిగిన ప్రయాణికుల సంఖ్య
విజయవాడలో 46%, విశాఖలో 33.8% పెరుగుదల
(ఆంధ్రజ్యోతి,-రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)
తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాలు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) గురువారం విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దీని ప్రకారం.. గత ఏడాది జనవరితో పోలిస్తే 2025 జనవరిలో విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రయాణించిన వారి సంఖ్య 46శాతం పెరిగింది. అలాగే, వైజాగ్‌లో 33.8 శాతం వృద్ధి కనిపించింది. తెలంగాణలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 21.2 శాతం వృద్ధి నమోదైంది. అలాగే విమాన సర్వీసుల పెరుగుదల అంశంలో హైదరాబాద్ 16.2 శాతం, విజయవాడలో 22.4శాతం, విశాఖపట్నంలో 34శాతం పెరుగుదల రికార్డయింది.
రోజుకు లక్షకు చేరువలో శంషాబాద్
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇటీవల మరిన్ని దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 21న రికార్డు స్థాయిలో 96వేల మంది రాకపోకలు సాగించారు. దేశీయ ప్రయాణికులు విశాఖలో 31.9 శాతం, విజయవాడలో 48.1 శాతం పెరిగారు.
త్వరలో మరిన్ని దేశాలకు నేరుగా..
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వచ్చేనెల 18న హోచిమిన్‌కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనున్నారు. మదీనా, హాంకాంగ్, పారిస్, ఆస్ట్రేలియా, ఆమ్‌స్టర్‌డామ్, రియాద్, హనోయ్, అడిస్ అబాబాకు కూడా సర్వీసులు నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.