CM Chandrababu on Artificial Intelligence: విద్యుత్‌లోఏఐ
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:12 AM
ద్యుత్ రంగంలో కృత్రిమ మేథ ఏఐ ను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంధనశాఖ..
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్ల వ్యయం తగ్గించాలి
ఇంధన రంగంపై సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ రంగంలో కృత్రిమ మేథ (ఏఐ)ను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంధనశాఖ అధికారులను ఆదేశించారు. తద్వారా నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఉత్పత్తి, కొనుగోళ్లకు అవకాశం ఉంటుందని చెప్పారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక విద్యుత్ డిమాండ్ ఎలా ఉంటుందో ముందే గుర్తించేందుకు ఏఐ బాగా ఉపయోగపడుతుందని అన్నారు. ఇంధన రంగంపై వరుసగా రెండోరోజు కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. గురువారం జరిగిన ఈ సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ వ్యయంతో సరఫరా చేయాలన్న లక్ష్యంతో ఎనర్జీ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఈపీఎంఎ్‌స)ను అమలు చేయాలన్నారు. దీన్ని విద్యుత్ కొనుగోళ్లకూ వినియోగించాలన్నారు. దీనివల్ల డిస్కమ్‌లకు గణనీయంగా ఆదా అవుతుందని, వినియోగదారులపై చార్జీల భారం కూడా తగ్గుతుందని తెలిపారు. రాష్ట్రంలో వేర్వేరు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విద్యుదుత్పత్తి, పంపిణీ ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. గతేడాది విద్యుత్తు కొనుగోళ్లు, వచ్చే ఏడాది అంచనాలను విశ్లేషించి తదనుగుణంగా మార్కెట్లో విద్యుత్‌ను సమీకరించాలని సూచించారు.
పంప్డ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీపై ప్రత్యేక దృష్టి
భవిష్యత్తులో గ్రీన్‌ఎనర్జీ అత్యంత కీలకంగా మారుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. మిగులు విద్యుత్‌ను నిల్వ చేయడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ను వినియోగించుకోవాలన్నారు. మార్కెట్‌లో కొనుగోళ్లకు బదులు.. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌కు ఎంత ఖర్చవుతుందో అధ్యయనం చేయాలన్నారు. ఆర్‌డీఎ్‌సఎస్ ద్వారా రూ.705 కోట్ల మిగులు సాధించామని అధికారులు ఈ సందర్భంగా చెప్పారు. డ్రోన్ ఆధారిత డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ మానిటరింగ్, పవన విద్యుత్ ప్రాజెక్టుల అవకాశాలను పరిశీలించాలన్నారు. విద్యుత్‌సంస్థల యాజమాన్య నిర్వహణ కోసం జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం), అసిస్టెంట్ ఇంజనీర్‌పోస్టులను అవసరమైన మేరకు భర్తీచేసుకోవాలని ఇంధనశాఖకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
‘సోలార్’లో నారావారి పల్లెకు స్కోచ్ అవార్డు
సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటులో నారా వారి పల్లెకు స్కోచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు దక్కినట్లు వచ్చిన లేఖలను ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు ఈ సమీక్షలో చంద్రబాబుకు చూపించారు. అదేవిధంగా సోలార్ కార్పొరేషన్, నెడ్‌క్యా్‌పలకు దక్కిన 11 స్కోచ్ అవార్డుల గురించి కూడా ఆ సంస్థల ఎండీ ఎం కమలాకరబాబు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. ఈ అవార్డులను వచ్చేనెల 20న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్రం అందించనుందని అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ట్రాన్స్‌కో జేఎండీ కీర్తి చేకూరి, సీఎండీలు సంతోషరావు, పృథ్వీతేజ్, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.