Minister Atchannaidu: అగ్రి వర్సిటీ భవనాలను వైసీపీ పట్టించుకోలేదు
ABN , Publish Date - Sep 26 , 2025 | 05:25 AM
రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన ఎన్జీ రంగా వర్సిటీకి పరిపాలన భవనం లేదని, తాము 80 శాతం పూర్తి చేసిన భవనాన్ని వైసీపీ హయాంలో కన్నెత్తి చూడలేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన ఎన్జీ రంగా వర్సిటీకి పరిపాలన భవనం లేదని, తాము 80 శాతం పూర్తి చేసిన భవనాన్ని వైసీపీ హయాంలో కన్నెత్తి చూడలేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. అవనిగడ్డ నియోజకవర్గంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, దీనికి శాశ్వత భవనాలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నామని మంత్రి తెలిపారు. లేదంటే ప్రస్తుతం కాలేజీ నడుస్తున్న గిరిజన సంక్షేమ శాఖ భవనానికైనా మరమ్మత్తులు చేయిస్తామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, జగన్ విధ్వంస పాలన ప్రభావం పాలిటెక్నిక్ కాలేజీపై కూడా పడిందన్నారు. తక్కువ నిధులతోనే కాలేజీ అద్భుతంగా మారుతుందని చెప్పారు. అలానే రాజమండ్రిలో కూడా వ్యవసాయ కళాశాలకు భూమిని కేటాయించాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు.