Share News

Visakhapatnam: హయగ్రీవ భూమి.. చట్టప్రకారమే స్వాధీనం

ABN , Publish Date - Mar 14 , 2025 | 04:29 AM

విశాఖలో హయగ్రీవ ఫామ్స్‌ అండ్‌ డెవలపర్స్‌కు చెందిన భూమి స్వాధీనం విషయంలో పూర్తిగా చట్టనిబంధనల ప్రకారమే వ్యవహరించామని అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

Visakhapatnam: హయగ్రీవ భూమి.. చట్టప్రకారమే స్వాధీనం

  • షరతులు ఉల్లంఘించినందునే భూకేటాయింపు రద్దు

  • పూర్తి వివరాలతో కౌంటర్‌ వేస్తాం

  • హైకోర్టుకు ఏజీ దమ్మాలపాటి నివేదన

  • ఆ ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్‌ చేయండి

  • హయగ్రీవ తరఫు సీనియర్‌ న్యాయవాది వినతి

  • 4 వారాలపాటు యఽథాతథ స్థితికి కోర్టు ఆదేశం

  • 2 వారాల్లో కౌంటర్‌ వేయాలని ప్రభుత్వానికి స్పష్టీకరణ

అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): విశాఖలో హయగ్రీవ ఫామ్స్‌ అండ్‌ డెవలపర్స్‌కు చెందిన భూమి స్వాధీనం విషయంలో పూర్తిగా చట్టనిబంధనల ప్రకారమే వ్యవహరించామని అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించామన్న వాదనలో వాస్తవం లేదన్నారు. ధర్మాసనం ఆదేశాల మేరకు పిటిషనర్‌కు షోకాజ్‌ నోటీసు ఇచ్చి.. అధికారులు వివరణ తీసుకున్నారని హైకోర్టుకు తెలిపారు. వృద్ధాశ్రమం, అనాథాశ్రమం నిర్మిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాయితీపై భూమి తీసుకున్నారని తెలిపారు. భూకేటాయింపు సందర్భంగా ప్రభుత్వం విధించిన షరతులు హయగ్రీవ సంస్థ ఉల్లంఘించిందని.. ఈ నేపఽథ్యంలోనే భూకేటాయింపు రద్దు చేస్తూ ఈ నెల 10న రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మెమో ఇచ్చారని.. దానికనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారని పేర్కొన్నారు. భూకేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన మెమోను పిటిషనర్‌ సవాల్‌ చేయలేదన్నారు. ఈ నెల 11న పంచనామా నిర్వహించి భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారని కూడా తెలిపారు. అయితే పంచనామా కాపీని స్వీకరించేందుకు పిటిషనర్‌ నిరాకరించారన్నారు. ప్రస్తుతం భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉందని, పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని తెలిపారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. స్వాధీనం చేసుకున్న భూమి విషయంలో నాలుగువారాల పాటు యఽథాతథస్థితి పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పిటిషనర్‌ను ఆదేశించింది.


ఇరుపక్షాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో రెండువారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి.చంద్ర ధనశేఖర్‌ గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. విశాఖ ఎండాడ పరిధిలోని సర్వే నెం.92/3లో తమ సంస్థకు కేటాయించిన 12.51 ఎకరాలను రద్దు చేసి వాటిని స్వాధీనం చేసుకునేందుకు ఈ నెల 10న జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాల్‌ చేస్తూ హయగ్రీవ ఫామ్స్‌ అండ్‌ డెవలపర్స్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ గద్దె బ్రహ్మాజీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయం ఆస్తుల బదలాయింపు చట్టం, హైకోర్టు తీర్పునకు విరుద్ధమని పేర్కొన్నారు. కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని కోరారు. అలాగే హయగ్రీవకు చెందిన భూమితో పాటు అందులో తనకు చెందిన 385 చదరపు గజాల ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకుంటున్నట్లు పేర్కొంటూ కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాల్‌ చేస్తూ ఆ ఫ్లాట్‌ ఓనర్‌ ఐనంపూడి నాగేశ్వరరావు మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు గురువారం విచారణకు రాగా హయగ్రీవ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. సేల్‌ డీడ్‌ను రద్దు చేసే అధికార పరిధి జిల్లా కలెక్టర్‌కు లేదన్నారు. భూముల విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించిందన్నారు. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా భూకేటాయింపును రద్దు చేస్తూ కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారని, ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనన్నారు. పంచనామా నిర్వహించకుండానే పోలీసులను ప్రయోగించి భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారన్నారు. కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఫ్లాట్‌ ఓనర్లకు ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా అధికారులు ఏకపక్షంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని న్యాయవాది జవ్వాజి శరత్‌చంద్ర అన్నారు. హయగ్రీవ ప్రాజెక్టు యజమాని జగదీశ్వరుడు తరఫున న్యాయవాది చక్రవర్తి వాదనలు వినిపించారు. వ్యాజ్యాలు దాఖలు చేసేందుకు పిటిషనర్లకు ఎలాంటి అర్హతా లేదన్నారు. రాజకీయ పలుకుబడితో జగదీశ్వరుడి నుంచి లాక్కున్నారని తెలిపారు. ‘హయగ్రీవ ఫామ్స్‌ అండ్‌ డెవలపర్స్‌’ ఏర్పాటుకు ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ కట్టలేదన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 04:29 AM