AP Model Education: అడ్మిషన్స్ ఆర్ క్లోజ్డ్
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:18 AM
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాల నోటీసు బోర్డులో కనిపించిన ప్రకటన ఇది
నో అడ్మిషన్స్ బోర్డుపెట్టిన ఆదోనిలోని మున్సిపల్ హైస్కూల్ అభినందించిన లోకేశ్
‘అడ్మిషన్స్ ఆర్ క్లోజ్డ్’... కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాల నోటీసు బోర్డులో కనిపించిన ప్రకటన ఇది! ఆదరణ తగ్గిందని భావిస్తున్న సమయంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో క్లాసులు నిండిపోవడం, కొత్త దరఖాస్తులు తీసుకోబోమంటూ ఏకంగా బోర్డు పెట్టడం అద్భుతమే! అందువల్లే ఈ విషయం దృష్టికి రాగానే విద్యాశాఖ మంత్రి లోకేశ్ స్పందించారు. ‘‘ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌కు మీరే రథసారథులు’ అంటూ ‘ఎక్స్’లో హెచ్‌ఎం ఫయాజుద్దీన్, ఇతర బోధనాసిబ్బందిని ఆయన అభినందించారు. నెహ్రూ మెమోరియల్ ఉన్నతపాఠశాల సామర్థ్యం 1725 మంది. కొత్తగా ఆరు నుంచి పదోతరగతి వరకు 425 మంది చేరితే, ఇందులో ఒక్క ఆరో తరగతిలోకే 278 మంది చేరారు. ఇంకో 25 మంది విద్యార్థుల అడ్మిషన్లు పరిశీలించాల్సి ఉంది. ఒక్కో తరగతి గదిలో 120 మందికి పైగా విద్యార్థులు కూర్చుంటున్నారు. ఇంకా కూర్చోబెట్టడానికి చోటు లేదు. దీంతో ‘నో అడ్మిషన్స్ బోర్డు’ పెట్టాల్సి వచ్చింది. పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెరుగుతుండడం, ఉపాధ్యాయులు క్రమశిక్షణతో బోధన చేస్తుండటం, ఎన్‌సీసీ, క్రీడలకు ప్రాధాన్యం, సన్నబియ్యంతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తుండడంతో.. తల్లిదండ్రులు తమ పిల్లల చెయ్యి పట్టుకుని ప్రభుత్వ బడి బాట పడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచీ ప్రతి రోజూ సిఫారసు లేఖలతో చాలామంది తల్లిదండ్రులు ఈ ఉన్నతపాఠశాల ఎదుట బారులు తీరడం విశేషం.
- ఆదోని అగ్రికల్చర్, ఆంధ్రజ్యోతి