Share News

High Court: అదానీకి బ్రేకులు

ABN , Publish Date - Nov 07 , 2025 | 05:27 AM

బీచ్‌శాండ్‌ మైనింగ్‌ వ్యవహారం మరోసారి న్యాయచిక్కుల్లో పడింది. టెండర్‌ వ్యవహారం నిలిచిపోయింది. అదానీ గ్రూప్‌నకు చెందిన అల్లూవియల్‌ హెవీ మినరల్స్‌, ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ...

High Court: అదానీకి బ్రేకులు

  • న్యాయచిక్కుల్లో బీచ్‌శాండ్‌ కాంట్రాక్ట్‌

  • డెవలపర్‌గా అల్లూవియల్‌ హెవీ మినరల్స్‌.. అదానీ కంపెనీకి 90శాతం వాటా

  • చట్టంలో ‘డెవలపర్‌’ లేదన్న వాదన తెర పైకి.. ప్రస్తుతం హైకోర్టులో కేసు విచారణ

  • ఎండీసీకి 10 శాతం వాటాపైనే కాంట్రాక్టు భవితవ్యం

(అమరావతి-ఆంధ్రజ్యోతి): బీచ్‌శాండ్‌ మైనింగ్‌ వ్యవహారం మరోసారి న్యాయచిక్కుల్లో పడింది. టెండర్‌ వ్యవహారం నిలిచిపోయింది. అదానీ గ్రూప్‌నకు చెందిన అల్లూవియల్‌ హెవీ మినరల్స్‌, ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)ల మధ్య ఒప్పందం కుదిరినా అది ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర మైనింగ్‌ చట్టం, మార్గదర్శకాలకు విరుద్ధంగా డెవలపర్‌ అనే పాత్రను తెరపైకి తెచ్చి అదానీ గ్రూప్‌నకు లబ్ధి చేకూర్చేందుకు టెండర్‌ కట్టబెట్టారని, వెంటనే ఈ టెండర్‌ను రద్దు చేయాలని గత నెలలో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

బీచ్‌శాండ్‌ ప్రాజెక్టులో డెవలపర్‌గా ఉన్న అదానీ గ్రూప్‌ కంపెనీకి 90 శాతం, లీజుదారు అయిన ఏపీఎండీసీకి 10 శాతం వాటాను ఖరారు చేయడం పట్ల న్యాయచిక్కులు ఉత్పన్నమయ్యాయి. వాటాలపై ఇంకా అగ్రిమెంట్‌ కాలేదని సర్కారు ఓవైపు హైకోర్టుకు నివేదించింది. కానీ ఇటీవల ప్రభుత్వ స్థాయిలో జరిగిన సమావేశంలో అల్లూవియల్‌ హెవీ మినరల్స్‌కు, ఏపీఎండీసీకి మధ్య వాటాలపై ఒప్పందం కుదిరిందని ప్రభుత్వ సంస్థ నివేదిక ఇచ్చింది. నిజానికి వాటాల ఒప్పందం ఖరారు కాలేదన్న అంశంపైనే కోర్టు ప్రభుత్వానికి అఫిడవిట్‌ దాఖలుకు సమయం ఇచ్చింది. కానీ ప్రభుత్వ స్థాయిలో ఒప్పందం పూర్తయినట్లుగా ఏపీఎండీసీ సర్కారుకు నివేదించడం చర్చనీయాంశంగా మారింది.


నాడు జగన్‌ సర్కారు డిజైన్‌

గత జగన్‌ ప్రభుత్వ హయాంలో బీచ్‌శాండ్‌ మైనింగ్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. లీజులు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీ పేరిట మంజూరు చేసింది. 2019లో మారిన కేంద్ర గనుల చట్టం (ఎంఎండీఆర్‌ యాక్ట్‌) ప్రకారం కేవలం ప్రభుత్వ రంగ సంస్థలే బీచ్‌శాండ్‌ మినరల్స్‌ మైనింగ్‌ చేయాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రైవేటు మైనింగ్‌ను నిషేధించింది. ఒకవేళ ప్రైవేటు సంస్థ భాగస్వామ్యం తప్పనిసరి అనుకుంటే, ప్రభుత్వ రంగ సంస్థకు 76 శాతం, ప్రైవేటు కంపెనీకి 24 శాతం వాటా చొప్పున ఎంఓయూ కుదుర్చుకొని ఉమ్మడి మైనింగ్‌ చేసుకోవచ్చని వెసులుబాటు ఇచ్చింది. అయితే అంతకుముందే బీచ్‌శాండ్‌పై అదానీ గ్రూప్‌ కన్నేసింది. దేశంలోనే అత్యంత విలువైన బీచ్‌శాండ్‌ నిక్షేపాలు, నిల్వలు ఒక్క ఏపీలోనే ఉన్నాయి. దీంతో ఏపీలో లబ్ధి పొందాలని ఆ సంస్ధ అనుకుంది. 2023లో అప్పటి జగన్‌ సర్కారు టెండర్‌ను తెరమీదకు తీసుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లా గార, విశాఖ జిల్లా భీమిలిలో కలిపి వెయ్యి హెక్టార్ల పరిధిలో బీచ్‌శాండ్‌ మైనింగ్‌ కోసం ప్రాజెక్టు డెవలపర్‌ అనే కొత్త విధానంతో టెండర్‌ రూపొందించారు. 2023లో టెండర్లు నిర్వహించగా అదానీ గ్రూప్‌నకు చెందిన కంపెనీ అల్లువియల్‌ హెవీ మినరల్స్‌కే టెండర్‌ దక్కింది. దీనిపై 2024లో పిల్‌ హైకోర్టులో దాఖలైంది. టెండర్‌ను ఖరారు చేయవద్దని హైకోర్టు అప్పట్లోనే ఆదేశాలు ఇచ్చింది. కూటమి సర్కారు వచ్చాక పిల్‌ వేసిన వ్యక్తి దాన్ని ఉపసంహరించుకున్నారు. దీంతో టెండర్‌ను ఏపీఎండీసీ ఖరారు చేసింది.


మరోసారి పిల్‌: అదానీ గ్రూప్‌నకు టెండర్‌ కట్టబెడుతూ అధికారిక ఉత్తర్వులిచ్చే సమయంలో అక్టోబరు 6న హైకోర్టులో మరో పిల్‌ దాఖలైంది. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. బీచ్‌శాండ్‌ మినరల్స్‌ మైనింగ్‌లో కేంద్రం ప్రైవేటు సంస్థలను నిషేధించాక, ప్రైవేటు కంపెనీలను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? ఆ కంపెనీకి 90 శాతం వాటా ఏ ప్రాతిపదికన ఇచ్చారు? అని న్యాయస్థానం ప్రశ్నించింది. తాము ప్రాజెక్టు డెవలపర్‌ను ఎంపిక చేశామని, ఇందులో ఉల్లంఘనలు లేవని ప్రభుత్వం నివేదించింది. అయితే, దీన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. వాటాలపై టెండర్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నారా? అని న్యాయస్థానం ప్రశ్నించినట్లు తెలిసింది. తాము వాటాలు ఎంతన్నది ఇంకా ఖరారు చేయలేదని సర్కారు కోర్టుకు నివేదించినట్లు సమాచారం. కేంద్ర చట్టం, మార్గదర్శకాల ప్రకారం ఏపీఎండీసీ వాటా ఎంతో తేల్చుకొని లిఖితపూర్వకంగా కోర్టుకు తెలియజేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, బీచ్‌శాండ్‌ మైనింగ్‌ ప్రాజెక్టులో లీజుదారు ఏపీఎండీసీ వాటా 10 శాతం, డెవలపర్‌గా అదానీ గ్రూప్‌నకు చెందిన అల్లూవియల్‌ హెవీ మినరల్స్‌ వాటా 90 శాతం. ఎండీసీ ఇటీవల ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో వాటాల విషయం ప్రముఖంగా ప్రస్తావించింది. ఎండీసీ, అల్లూవియల్‌ హేవీ మినరల్స్‌ మధ్య ఒప్పందం కుదిరిందని అందులో పేర్కొంది. అయితే, న్యాయస్థానానికి మాత్రం ఇంకా వాటాలు ఖరారు కాలేదని ఎండీసీ నివేదించినట్లు తెలిసింది. దీనిపై విమర్శలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి ఆదేశాలు

Agriculture Minister: పరిహారమిచ్చినా ధాన్యం కొంటాం

Updated Date - Nov 07 , 2025 | 07:02 AM