Share News

Nandyal ACB case: వజ్రాల హారాలు.. బంగారు వడ్డాణాలు

ABN , Publish Date - May 21 , 2025 | 03:26 AM

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ డివిజన్ విద్యుత్‌శాఖ ఏడీఈ రవికాంత్‌చౌదరి పై ఆదాయానికి మించి రూ.3 కోట్ల ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఆయన సతీమణి హిమబిందు బ్యాంకు లాకర్‌లో రూ.2.85 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

Nandyal ACB case: వజ్రాల హారాలు.. బంగారు వడ్డాణాలు

కోట్లకు పడగలెత్తిన ఆళ్లగడ్డ విద్యుత్‌ ఏడీఈ

భార్య బ్యాంకు లాకర్‌లో 2.8 కిలోల బంగారం

విలువ రూ.2.85 కోట్ల పైనే.. ఇంటి విలువే 3 కోట్లు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు

నంద్యాల, మే 20(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ డివిజన్‌ విద్యుత్‌శాఖ ఏడీఈ రవికాంత్‌చౌదరిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఐదు రోజుల క్రితం ఓ రైతు నుంచి రవికాంత్‌ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా, దర్యాప్తులో కళ్లు చెదిరే ఆస్తులు, బంగారు నగలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఏడీఈ ఇంట్లో విలువైన పత్రాలు, ఎల్‌ఐసీ బాండ్లు, ఎఫ్‌డీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఆయన సతీమణి హిమబిందు బ్యాంకు లాకర్‌లో కోట్ల విలువైన బంగారు ఆభరణాలు గుర్తించారు. మంగళవారం.. ఏసీబీ డీఎస్పీ సోమన్న, సీఐలు కృష్ణయ్య, శ్రీనివాసులు తమ సిబ్బందితో కలిసి ఏడీఈ ఇంటికి వెళ్లారు. సాయంత్రం ఏడీఏ సతీమణి హిమబిందును వెంటబెట్టుకుని నంద్యాల పట్టణంలోని ఒక పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుకు వెళ్లి, ఆమె పేరిట ఉన్న లాకర్‌ను తెరిపించారు. అందులో రూ.2.85 కోట్ల విలువ చేసే 41 రకాల బంగారు ఆభరణాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ నగల్లో వజ్రాలతో పొదిగిన హారాలు, ఆకర్షణీయమైన మూడు వడ్డాణాలతో పాటు 10 జతల కమ్మలు, బంగారం జడ కుచ్చులు, వంకీలు, లాంగ్‌చైన్స్‌ వంటివి కూడా ఉన్నాయి.

fgj.jpg

అనంతరం డీఎస్పీ సోమన్న మీడియాతో మాట్లాడుతూ.. ఏడీఈ ఇంటి విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుందని చెప్పారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే కోణంలో దర్యాప్తు సాగుతోందన్నారు.


లైన్‌మెన్‌గా చేరి ఏడీఈ స్థాయికి..

రవికాంత్‌చౌదరి 30 ఏళ్ల కిందట విద్యుత్‌శాఖలో లైన్‌మెన్‌గా చేరారు. ఆ తర్వాత లైన్‌ ఇన్‌స్పెక్టర్‌, ఏఈగా పదోన్నతి పొందడంతో సమీప ప్రాంతాల్లోనే సుదీర్ఘకాలం పనిచేశారు. మూడేళ్ల కిందట ఏడీఈగా పదోన్నతి పొంది ఇక్కడే పనిచేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News

Updated Date - May 21 , 2025 | 03:26 AM