ACB Court Orders SIT: ఆ రూ.11 కోట్ల వీడియోలు ఇవ్వండి
ABN , Publish Date - Aug 05 , 2025 | 06:11 AM
లిక్కర్ స్కామ్‌లో స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల నగదుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను తమకు అందజేయాలని సిట్, బ్యాంక్
సిట్, బ్యాంక్ మేనేజర్‌కు ఏసీబీ కోర్టు ఆదేశం
విజయవాడ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): లిక్కర్ స్కామ్‌లో స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల నగదుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను తమకు అందజేయాలని సిట్, బ్యాంక్ మేనేజర్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నగదును ఇతర నగదుతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలని ఈ నెల 2వ తేదీన ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు ఇచ్చే సమయానికి నగదు చెస్ట్ (నగదును భద్రపరిచే విభాగం)కు వెళ్లిపోయింది. రూ.11 కోట్లు విజయవాడలోని సిట్ కార్యాలయం నుంచి మాచవరం ఎస్‌బీఐ బ్యాంక్‌కు వెళ్లడం, అక్కడి నుంచి చెస్ట్‌కు వెళ్లిన వీడియోలను భద్రపరచాలని, ఆ నోట్లపై సీరియల్ నంబర్లను రికార్డు చేయాలని ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తరఫున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం వాదనలు జరిగాయి. కసిరెడ్డి తరఫున మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, దుశ్యంత్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, విష్ణువర్ధన్ వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ తరఫున జేడీ రాజేంద్రప్రసాద్ వాదించారు. ఫామ్‌హౌస్ నుంచి రూ.20 కోట్లు సీజ్ చేసిన సిట్ రూ.11 కోట్లను స్వాధీనం చేసుకున్నట్టు చూపిందని పొన్నవోలు వాదించారు. ఈ నగదును ప్రత్యేకంగా ఉంచాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని పాటించలేదన్నారు. నగదు సిట్ కార్యాలయం నుంచి బయలుదేరినప్పటి నుంచి ఎస్‌బీఐకి వెళ్లడం, అక్కడి నుంచి చెస్ట్‌కు చేరడం.. ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజీని భద్రపరచాలని కోరారు. ఇరువైపు వాదనలు విన్న అనంతరం న్యాయాధికారి పి.భాస్కరరావు సిట్ దర్యాప్తు అధికారికి, బ్యాంక్ మేనేజర్‌కు ఆదేశాలు జారీ చేశారు.