అగ్ని ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:20 AM
నంద్యాల సమీపంలోని చాపిరేవుల టోల్ ప్లాజా వద్ద మంగళవారం తెల్లవారుజామున సుమారు 4.40 గంటల సమయంలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది.

చాపిరేవుల టోల్ ప్లాజా వద్ద ఘటన
బస్సులో సుమారు 45మంది ప్రయాణికులు
టోల్‌ప్లాజా సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ముప్పు
నంద్యాల క్రైం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): నంద్యాల సమీపంలోని చాపిరేవుల టోల్ ప్లాజా వద్ద మంగళవారం తెల్లవారుజామున సుమారు 4.40 గంటల సమయంలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. అరుణాచలం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఎనఎస్‌కె ప్రైవేట్ ట్రావెల్ బస్సు నంద్యాల సమీపంలోని చాపిరేవుల గ్రామం వద్ద ఉన్న టోల్ ప్లాజావద్దకు రాగానే మంటలు వ్యాపించాయి. టోల్‌ప్లాజా సిబ్బంది గమనించి డ్రైవర్, ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అందరూ వెంటనే బస్సు దిగారు. టోల్ ప్లాజా సిబ్బంది తమ వద్ద ఉన్న అగ్నిప్రమాద నివారణ యంత్రాలతో ప్రమాదాన్ని అరికట్టేందుకు యత్నించినా సాధ్యం కాలేదు. వెంటనే వారు సమాచారాన్ని నంద్యాల అగ్నిమాపక సిబ్బందికి చేరవేశారు. వారు వచ్చి బస్సు అద్దాలను పగులగొట్టి మంటలను ఆర్పివేశారు. ఈ సందర్భంగా అగ్నిమాపక దళ సిబ్బంది మాట్లాడుతూ బస్సు నిర్విరామంగా ప్రయాణం చేయడంవల్ల బస్సు టైర్ల దగ్గర ఉండే వీల్స్ తీవ్ర రాపిడికి గురై వేడితో మంటలు వ్యాపించాయన్నారు. సకాలంలో టోల్‌ప్లాజా సిబ్బంది అప్రమత్తతమై తమకు సమాచారం అందించడంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదన్నారు. ఈ బస్సులో సుమారు 45మంది ప్రయాణికులు ఉన్నట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ప్రమాదంలో బస్సు లోపలి భాగంలో కూడా పాక్షిక నష్టం వాటిల్లింది.