పథకం ప్రకారమే నాటి దాడి
ABN , Publish Date - Feb 14 , 2025 | 06:01 AM
అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్‌పై పథకం ప్రకారం బూతులవర్షం! దీనికి నిరసనగా గన్నవరం టీడీపీ ఆఫీసులో సమావేశమైన నేతలపై ఆ మరునాడే రాళ్లవాన! వల్లభనేని వంశీమోహన్ స్వయంగా వేసిన స్కెచ్ ఇదీ! 2023 ఫిబ్రవరి 20వ తేదీన ఏం జరిగిందంటే... అప్పటికి కొన్ని రోజులుగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని వంశీ మాటల

బూతుల వర్షంతో రెచ్చగొట్టిన వంశీ
టీడీపీ నేతలను గన్నవరం రప్పించి రాళ్లవాన
టీడీపీ కార్యాలయం ధ్వంసం.. కార్ల దహనం
అడ్డుకున్న టీడీపీ శ్రేణులపై రౌడీలతో దాడి
పట్టాభి లక్ష్యంగా రోజంతా బీభత్సకాండ
‘గన్నవరం’ కేసులో నిందితులకు షాక్
36 మందికి ముందస్తు బెయిల్ నిరాకరణ
పది మందికి రెగ్యులర్ బెయిల్ మంజూరు
(విజయవాడ - ఆంధ్రజ్యోతి)
అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్‌పై పథకం ప్రకారం బూతులవర్షం! దీనికి నిరసనగా గన్నవరం టీడీపీ ఆఫీసులో సమావేశమైన నేతలపై ఆ మరునాడే రాళ్లవాన! వల్లభనేని వంశీమోహన్ స్వయంగా వేసిన స్కెచ్ ఇదీ! 2023 ఫిబ్రవరి 20వ తేదీన ఏం జరిగిందంటే... అప్పటికి కొన్ని రోజులుగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని వంశీ మాటల దాడిని తీవ్రతరం చేశారు. అనకూడని మాటలు అన్నారు. దమ్ముంటే గన్నవరం వచ్చి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈ క్రమంలో దాడికి ఒక రోజు ముందు, అంటే 19వ తేదీన టీడీపీ మండల పార్టీ నేతలు గన్నవరం పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టారు. వంశీ వ్యాఖ్యలను దీటుగా ఖండించారు. దీనిని సహించలేకపోయిన వంశీ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న నాయకులను ఆ మరుసటి రోజు టార్గెట్ చేశారు. ముందుగా గన్నవరం మండల టీడీపీ అధ్యక్షులు జాస్తి వెంకటేశ్వరరరావుపై గురిపెట్టారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారంటూ దానిని తహసీల్దార్ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించగా, అటుగా జాస్తి వెళ్లారు. ఇదంతా పథకం ప్రకారమే జరిగింది. మరోవైపు.. మండల పార్టీ నాయకుడు దొంతు చిన్నా ఇంటికి వంశీ అనుచరులు వెళ్లి నానా దుర్భాషలాడారు. చిన్నా అక్కడ లేకపోవటంతో దాడి జరగలేదు. ఈ విషయం తెలుసుకున్న జాస్తి వెంకటేశ్వరరావు పోలీసులకు వంశీ, అనుచరులపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే పని మీద టీడీపీ ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి ఫోన్ చేసి పిలిపించారు. పట్టాభితో కలిసి టీడీపీ నేతలంతా పోలీసు స్టేషన్‌కు ఆ రోజు సాయంత్రం చేరుకున్నారు. ఇదే అదునుగా.. గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై వంశీ అనుచరులు, వైసీపీ మూకలు దాడి చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్‌ను భయపెట్టి బయటకు పంపించివేసి, విధ్వంసకాండను యథేచ్ఛగా సాగించాయి. దీనికోసం బయట ప్రాంతాల నుంచి రౌడీలను వంశీ తెప్పించారు.
రాళ్ల వాన.. సీఐకి గాయాలు
పోలీసు స్టేషన్‌లో ఉన్న టీడీపీ నేతలు దాడి విషయం తెలుసుకుని, పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. టీడీపీ కార్యకర్తలు భారీఎత్తున తమ నాయకులను అనుసరించారు. ఈక్రమంలో ఎన్‌హెచ్ - 16 పై టీడీపీ శ్రేణులను వైసీపీ మూకలు, రౌడీ గ్యాంగులు అడ్డుకున్నాయి. పట్టాభిని లక్ష్యంగా చేసుకుని దాడికి విఫలయత్నం చేశాయి. టీడీపీ నాయకులు పట్టాభిని హడావిడిగా కారు ఎక్కించి పంపించే ప్రయత్నం చేయగా, అదే కారులోకి పోలీసులు ఎక్కారు. పట్టాభిని వారు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా, టీడీపీ కార్యకర్తలు గట్టిగా ప్రతిఘటించారు. ఇంతలో టీడీపీ నేతలపై వైసీపీ మూకలు రాళ్లవర్షం కురిపించాయి. ఈ దాడిలో టీడీపీ మహిళా నాయకురాలు మండవ లక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. గొడవ జరుగుతుండగానే పట్టాభిని పోలీసులు అదే కారులో వీరవల్లి పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. ఈ క్రమంలో ఎవరు విసిరారో తెలియదు కానీ ఒక రాయి స్థానిక సీఐ కనకారావు తలకు తగిలింది.
టీడీపీ నాయకులపై ఎదురు కేసులు...
రౌడీలు, వైసీపీ మూకల దాడిలో దెబ్బలు తిన్న టీడీపీ నాయకులపైనే పోలీసులు ఎదురు కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక .. టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి అప్పటి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ ద్వారా కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో మొత్తం 93 మందిని నింధితులుగా తేల్చారు. ఈ కేసును 2024 నవంబరు 16న సీఐడీకి అప్పగించారు. మొత్తం 93 నిందితుల్లో 49 మందిని అరెస్టు చేశారు. మరో 31 మంది సుప్రీంకోర్టుకు వెళ్లి అరెస్టు కాకుండా ఊరట పొందారు. ఇంకా 13 మందిని అరెస్టు చేయాల్సి ఉండగా.. వారంతా అజ్ఞాతంలో ఉన్నారు. కేసు విచారణ కీలక దశలో ఉన్న తరుణంలో సత్యవర్థన్ కోర్టుకు హాజరై తాను ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నానని వాంగ్మూలం ఇవ్వటం సంచలనం సృష్టించింది. సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేశారన్న అభియోగంపై వంశీని పోలీసులు అరెస్టు చేశారు.