Share News

Health Department : ఆరోగ్యశాఖలో 7099 మంది బదిలీ

ABN , Publish Date - Jun 21 , 2025 | 04:10 AM

వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల ప్రక్రియ దాదాపు ముగిసింది. 7,099 మంది సిబ్బంది స్థానచలనం పొందారు

Health Department : ఆరోగ్యశాఖలో 7099 మంది బదిలీ

  • రెండో విడతలో గ్రేడ్‌-3 ఏఎన్‌ఎంలకు.. డీఎంఈ పరిధిలో ఇష్టారాజ్యంగా బదిలీలు

  • ఎన్‌ఎంసీ పేరుతో ఖాళీలు దాచేసిన వైనం

అమరావతి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల ప్రక్రియ దాదాపు ముగిసింది. 7,099 మంది సిబ్బంది స్థానచలనం పొందారు. ఒకేచోట ఐదేళ్ల సర్వీసు దాటినవారు తప్పనిసరి బదిలీ అయ్యారు. వీరితో పాటు 1,899 మందిని అభ్యర్థనల మేరకు వేరే చోటుకు మార్చారు. ఇక గ్రామస్థాయిలో పనిచేసే 9,650 మంది గ్రేడ్‌-3 ఏఎన్‌ఎంల బదిలీల ప్రక్రియ మిగిలి ఉంది. దీన్ని ఈ నెలాఖరుకు పూర్తిచేయాలని ఆరోగ్యశాఖ భావిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల విభాగం సమన్వయంతో ఈ బదిలీలను చేయాల్సి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈనెల 30 వరకూ గడువు ఇచ్చింది. బదిలీల ప్రక్రియను సజావుగా, వివాదరహితంగా నిర్వహించడంపై ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ హర్షం వ్యక్తం చేశారు.


ఖాళీల జాబితాలో పదేపదే మార్పులు

కాగా, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) పరిధిలో జరిగిన బదిలీలపై అరోపణలు వస్తున్నాయి. వైద్యులకు చూపే ఖాళీల జాబితాను రెండుసార్లు మార్చారు. తొలుత ఆంధ్రా, రంగరాయ, సిద్ధార్థ, గుంటూరు, కర్నూలు, తిరుపతి మెడికల్‌ కాలేజీల్లోని ఖాళీలను చూపకూడదని ఉన్నతాధికారులు నిర్ణయించుకున్నారు. ఆయా చోట్ల భారీగా ఖాళీలున్నప్పటికీ, కొత్త కాలేజీల నుంచి చాలా మంది పాత కాలేజీలకు వచ్చేస్తారన్న ఉద్దేశంతో.. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) బూచి చూపించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే డీఎంఈలో అధికారులు అత్యుత్సాహంతో అన్ని కాలేజీల్లోని ఖాళీల జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టారు. ఇది వారం క్రితం గందరగోళానికి దారితీసింది. దీంతో పాత కాలేజీల్లో ఖాళీలను తొలగించి మరో లిస్ట్‌ను వెబ్‌సైట్‌లో ఉంచారు. దాని ఆధారంగా ఐదేళ్ల సర్వీస్‌ దాటిన వారితో పాటు రిక్వెస్ట్‌ బదిలీల కోసం వైద్యులు ఆప్షన్‌ పెట్టుకున్నారు. మంగళవారం సాయంత్రం వరకు ఆన్‌లైన్‌లో ఖాళీలను చూపించి బదిలీల ప్రక్రియ చేపట్టారు.


ఈ క్రమంలో అకస్మాత్తుగా మరికొన్ని ఖాళీలను చేర్చారు. కాకినాడలోని రంగరాయ మెడికల్‌ కాలేజీలో ఆర్థోపెడిక్‌ విభాగంలో కొన్ని, గుంటూరు, ఆంధ్రా కాలేజీల్లో కొన్ని ఖాళీలను చూపారు. వీటికి కూడా కొంత మంది ఆప్షన్‌ పెట్టుకున్నారు. తొలుత ఆరు కాలేజీల్లో ఖాళీలు చూపకూడదనుకున్న అధికారులు.. ఇప్పుడు వెబ్‌ ఆప్షన్‌లో ఉన్నట్టుండి కొన్నింటిని చూపడంపై వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని ఓ ఆర్థో విభాగం ప్రముఖ వైద్యుడి కోసం డీఎంఈ అధికారులు లిస్ట్‌లో లేని రంగరాయ మెడికల్‌ కాలేజీలో ఖాళీని చూపించారు. తొలుత ఎన్‌ఎంసీ పేరుతో ఈ ఖాళీని చూపలేదు. అలానే ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో మూడు గైనిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల ఖాళీలను తొలుత చూపలేదు. కౌన్సెలింగ్‌ సమయంలో అకస్మాత్తుగా తెరపైకి తెచ్చారు. అలానే విశాఖలో ఒక వైద్యుడు 14 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నారు. కొవిడ్‌లో పనిచేశారని ఆయనకు మినహాయింపు ఇచ్చి అక్కడే కొనసాగిస్తున్నారు. మరొక జనరల్‌ మెడిసిన్‌ వైద్యుడు కొవిడ్‌ సమయంలో పనిచేసినా మినహాయింపు ఇవ్వకుండా బదిలీ చేయడం గమనార్హం. ఇలా బదిలీల ప్రక్రియను ఇష్టారాజ్యంగా నిర్వహించారు. మరోవైపు మంగళవారం చేపట్టిన కౌన్సెలింగ్‌లో స్లైడింగ్‌ ఇస్తామని అధికారులు చెప్పలేదు. గురువారం జరిగిన కౌన్సిలింగ్‌లో మాత్రం స్లైడింగ్‌ ఇచ్చారు.


వారిద్దరి వల్లేనా ఈ తతంగం?

డీఎంఈలో అడిషనల్‌ డైరెక్టర్‌, మరొక అధికారి వల్లే ముందుగా ప్రకటించని ఖాళీలు అకస్మాత్తుగా తెరపైకి వచ్చాయన్న విమర్శలు వస్తున్నాయి. సదరు అధికారులు నచ్చినవారికి పాత కాలేజీల్లో ఖాళీలు చూపడం, లేకుంటే దాచేయడం చేశారు. అందులో భాగంగానే రంగరాయ కాలేజీ ఆర్థో విభాగంలో, ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో గైనిక్‌, గుంటూరులో కొన్ని విభాగాల్లో ఖాళీలను చూపారు. దీని వెనుక పెద్ద కథే నడించిందని చెబుతున్నారు. చూపిస్తే పాత కాలేజీల్లోని మొత్తం ఖాళీలు చూపించాలి, లేదంటే ఎన్‌ఎంసీ పేరుతో ఒక్కటి కూడా చూపకూడదు. ఈ నేపథ్యంలో బదిలీలు పారదర్శకంగా జరిగినట్టా? లేదా? అన్నది ఉన్నతాధికారులే చెప్పాలి.

Updated Date - Jun 21 , 2025 | 06:34 AM