Amaravati event: ఐదు లక్షల మందితో 2న ప్రధాని సభ
ABN , Publish Date - Apr 24 , 2025 | 04:43 AM
రాజధాని అమరావతిలో మే 2న జరిగే ప్రధాని నరేంద్ర మోదీ సభకు 5 లక్షల మంది హాజరుకానున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. సమ్మెలో ప్రజల రాకపోకలకు 8 రోడ్లను, 11 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.
అందుకు తగ్గట్లుగా అమరావతిలో పకడ్బందీ ఏర్పాట్లు
పోలీస్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ
గుంటూరు, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభం సందర్భంగా వచ్చే నెల 2న జరిగే ప్రధాని నరేంద్ర మోదీ సభకు 5 లక్షల మంది హాజరుకానున్నారని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. అమరావతిలో జరిగే ఆ సభకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రధాని రోడ్ షో, సభ ఏర్పాట్లను మంత్రి బుధవారం పరిశీలించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్‌తో కలిసి రెండుగంటలపాటు రాజధానిలోని పలు ప్రాంతాల్లో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ప్రధాని పాల్గొనే సభా ప్రాంగణానికి చేరుకునేందుకు అవసరమైన రోడ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మే 2న మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి అమరావతికి వచ్చి 1.1 కిలోమీటర్ల మేర రోడ్ షోలో పాల్గొంటారని, అనంతరం వేదిక వద్దకు చేరుకుంటారని వెల్లడించారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సభలో ఉంటారని చెప్పారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 5 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నామని, దానికి తగినట్లుగా శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల రాకపోకలకు మొత్తం 8 రోడ్లను, 11 పార్కింగ్ ప్రదేశాలను గుర్తించామని తెలిపారు. ప్రజలు సభ వద్దకు చేరుకునేందుకు వీలుగా ఈ-11, ఈ-13, ఈ-15 రోడ్లతో పాటు సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి రాకపోకలు జరుగుతాయని తెలిపారు. ఈ రోడ్లకు తక్షణం మరమ్మతులు చేసి అభివృద్ధి చేయాలని సీఆర్డీఏను ఆదేశించామన్నారు. మంగళగిరి నుంచి రెండు రోడ్లు, తాడేపల్లి నుంచి ఒకటి, వెస్ట్ బైపాస్ నుంచి ఒకటి, ప్రకాశం బ్యారేజి నుంచి రెండు, తాడికొండ నుంచి ఒకటి, హరిశ్చంద్రాపురం నుంచి ఒక రోడ్డు ద్వారా సభా వేదిక వద్దకు చేరుకోవచ్చని తెలిపారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ జామ్‌కు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..