Share News

Illegal Admissions: బీఈడీలో సీట్ల గోల్‌మాల్‌!

ABN , Publish Date - Feb 01 , 2025 | 05:30 AM

ఇప్పుడు అడ్మిషన్ల కోటాల్లో గోల్‌మాల్‌ చేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. స్పాట్‌, మేనేజ్‌మెంట్‌ కోటా అడ్మిషన్లలో 4,791 ఉల్లంఘనలు జరిగినట్లు ఉన్నత విద్యామండలి ఇటీవల తనిఖీల్లో గుర్తించింది.

Illegal Admissions: బీఈడీలో సీట్ల గోల్‌మాల్‌!

425 కాలేజీల్లో అడ్మిషన్లలో అవకతవకలు

ఉన్నత విద్యామండలి తనిఖీల్లో గుర్తింపు

సైన్స్‌ విభాగంలో చూపిస్తూ ఆర్ట్స్‌లో సీట్లు

4,791 ఉల్లంఘనలు... ఒక్కోదానికి 2వేలు జరిమానా

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కాలేజీల్లో అక్రమాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకూ కళాశాల భవనాలు, ల్యాబ్‌లు, మౌలిక వసతుల అంశాల్లో ఎక్కువగా ఉల్లంఘనలు జరిగేవి. ఇప్పుడు అడ్మిషన్ల కోటాల్లో గోల్‌మాల్‌ చేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. స్పాట్‌, మేనేజ్‌మెంట్‌ కోటా అడ్మిషన్లలో 4,791 ఉల్లంఘనలు జరిగినట్లు ఉన్నత విద్యామండలి ఇటీవల తనిఖీల్లో గుర్తించింది. ఒక్కో ఉల్లంఘనకు రూ.2వేలు చొప్పున జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది. కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోవడం వంటి సాధారణ ఉల్లంఘనలకు జరిమానాలు విధించడం లేదు. మొత్తంగా 425 కాలేజీల్లో అడ్మిషన్ల ఉల్లంఘనలు జరిగితే వాటిలో 390 కళాశాలల్లో సీట్ల కేటాయింపు కోటాల్లో అవకతవకలను గుర్తించారు. ఒక కాలేజీలో గరిష్ఠంగా 55 శాతం సీట్లు సైన్స్‌, గణితం సబ్జెక్టులకు కేటాయించాల్సి ఉంటే, ఆ పరిమితిని దాటి ఇచ్చేశారు. అలాగే ఒక కోర్సులో తక్కువ సీట్లు భర్తీ అయి, మరో కోర్సుకు డిమాండ్‌ ఉంటే... డిమాండ్‌ ఉన్న కోర్సులో సీట్లు భర్తీచేసి ఖాళీగా ఉన్న కోర్సులో భర్తీ చేసినట్లుగా చూపిస్తున్నారు. ఆర్ట్స్‌ సీట్లను తీసుకొచ్చి సైన్స్‌లో చూపిస్తున్న ఉల్లంఘనలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. కాలేజీలో మొత్తం సీట్లు భర్తీ చేసుకోవడమే లక్ష్యంగా గ్రూపులను మార్చి చూపిస్తున్నారు. అయితే ఇప్పటికే విద్యార్థులకు తరగతులు జరుగుతున్నందున జరిమానాలు విధిస్తూ మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం విద్యార్థుల నుంచి వసూలు చేయకుండా యాజమాన్యాలే చెల్లించాలని స్పష్టం చేసింది. జరిమానా కట్టకపోతే చర్యలు తీసుకుంటామని పేర్కొంది.


రాష్ట్రేతర విద్యార్థులతో భర్తీ

బీఈడీలో కన్వీనర్‌ కోటాను పక్కనపెట్టి స్పాట్‌, మేనేజ్‌మెంట్‌ కోటాలో ఎక్కువగా సీట్లు భర్తీ చేస్తారు. తరగతులు హాజరు కాకపోయినా సులభంగా పాస్‌ చేయిస్తామనే అనధికార ఒప్పందాలతో ఈ వ్యవహారం సాగుతోంది. అందులోనూ ఇతర రాష్ర్టాల విద్యార్థులతో ఎక్కువ సీట్లు భర్తీ చేసుకుంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో సంబంధం లేకుండా అదనంగా వసూలు చేస్తున్నారు. పరీక్షల సమయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి అందరినీ పాస్‌ చేయిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి అక్రమాలు జరిగినా అప్పటి అధికారులు పట్టించుకోలేదు. మేనేజ్‌మెంట్లతో కుమ్మక్కై కాలేజీలకు నచ్చినట్లుగా అడ్మిషన్లు తీసుకునే అవకాశం కల్పించారు. దీంతో కాలేజీ అడ్రస్‌ తెలియకపోయినా పేపర్లపై భారీగా అడ్మిషన్లు జరిగేవి. ఇకపై అలాంటి అక్రమాలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఉన్నత విద్యామండలి తనిఖీలు ప్రారంభించింది. ఇకపై బీఈడీ కాలేజీల్లో అన్ని కోణాల్లో తనిఖీలు చేపడతామని మండలి వర్గాలు తెలిపాయి.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 05:30 AM