Land Re-Survey : పరిష్కారం.. కాగితాల్లోనే?
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:02 AM
జగన్ జమానాలో భూముల రీ సర్వే జరిగిన గ్రామాల్లో రైతుల నుంచి 4.20 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. అవన్నీ పరిష్కరించేశామని రీ సర్వే డీటీలు నివేదికలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ సభల్లో రీ సర్వేపై 2.80 లక్షల ఫిర్యాదులు వచ్చాయి.

రైతుల నుంచి 4.20 లక్షల ఫిర్యాదులు
రీ సర్వే అప్పీల్స్‌ను పట్టించుకోని ఆర్‌ఎస్ డీటీలు
జగన్ జమానాలో భ్రష్టుపట్టిన అప్పీల్స్ విధానం
తాజాగా గుర్తించిన రెవెన్యూ శాఖ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జగన్ జమానాలో భూముల రీ సర్వే జరిగిన గ్రామాల్లో రైతుల నుంచి 4.20 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. అవన్నీ పరిష్కరించేశామని రీ సర్వే డీటీలు నివేదికలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ సభల్లో రీ సర్వేపై 2.80 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. మరి అప్పట్లోనే ఫిర్యాదులన్నీ పరిష్కరించేస్తే మళ్లీ ఎందుకు వస్తున్నాయి?.. అంటే ఆ పరిష్కారమంతా జరిగింది కాగితాల్లోనే. ఫిర్యాదుల పరిష్కారానికి అప్పట్లోనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినా.. అది పనిచేయలేదు. ఎందుకని రెవెన్యూ ఉన్నతాధికారులు ఆరా తీస్తే.. విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి.
కొలువు ఒకచోట.. పని చేసేది మరోచోట
జగన్ ప్రభుత్వం మూడున్నరేళ్లలో ఎనిమిది వేల గ్రామాల్లో భూములను రీ సర్వే చేసిన సంగతి తెలిసిందే. సర్వే, సరిహద్దుల చట్టం ప్రకారం రీ సర్వేలో తప్పులు వస్తే వాటిని పరిష్కరించడానికి మండల స్థాయిలో ప్రత్యేకంగా అప్పీల్స్ వ్యవస్థ ఉండాలి. డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారి అప్పీల్స్ చూడాలి. దీంతో సీనియర్ అసిస్టెంట్లకు డీటీలుగా పదోన్నతులు కల్పించి అప్పీల్స్ చూసే బాధ్యతను అప్పగించారు. ఇలా 679 మండలాలకు అప్పీల్స్ డీటీలను నియమించారు. వీరి బాధ్యత పూర్తిగా రీ సర్వే కేసుల పరిష్కారమే. వారు మరో పనిలో భాగస్వాములు కావడానికి వీల్లేదు. అయితే, ఆచరణలో ఈ వ్యవస్థ పనితీరు గాడితప్పింది. రీ సర్వే డీటీలుగా పోస్టింగ్‌లు పొందిన అనేకమంది నాటి వైసీపీ నేతల అండదండలు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో ఉన్న పరిచయాలతో రెవెన్యూ రెగ్యులర్ డీటీలుగా ఎఫ్‌ఏసీ అధికారాలు (పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు) పొందారు. మరికొందరు పౌరసరఫరాల శాఖ డీటీలుగా పోస్టింగ్‌లు తెచ్చుకున్నారు. ఇలా రీ సర్వే ప్రాజెక్టులో, అటు ఎఫ్‌ఏసీ కింద ఇతర శాఖల్లో జోడు పోస్టులు నిర్వహించారు. రెవెన్యూ శాఖలో డీటీల కొరత తీవ్రంగానే ఉంది. దీంతో కలెక్టర్లు రీసర్వే డీటీలకు అదనపు బాధ్యతల కింద ఇతర శాఖల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. దీంతో వీరంతా ఇతర శాఖల పనిలో బిజీగా ఉండిపోయి.. రీ సర్వే సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టలేదు. అయినా ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వం మరుగున పెట్టింది. రీ సర్వే జరిగిన గ్రామాల్లో రైతుల నుంచి 4.20 లక్షల ఫిర్యాదులు వచ్చాయని, వాటిని రీ సర్వే డీటీలు పరిష్కరించారని నివేదికలు తయారు చేసింది. రీ సర్వే అప్పీల్స్ పరిష్కారమయ్యాయి కాబట్టే ఆ గ్రామాల్లో రీ సర్వే ఫైనల్ నోటిఫికేషన్లు జారీ చేశారు. కానీ, రీ సర్వే అనంతరం ఇచ్చిన కొత్త పాస్ పుస్తకాలు, రికార్డుల్లోనూ తప్పులు కనిపించాయి. దీంతో రైతులు జగన్ ఫోటోలున్న పాస్ పుస్తకాలు చించేశారు. భూముల విస్తీర్ణంలో తేడాలు, సర్వే నంబర్లతో తప్పులు, సరిహద్దుల్లో లోపాలు ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఫిర్యాదులను గాలికొదిలేశారు!
కూటమి ప్రభుత్వం వచ్చాక రీ సర్వే జరిగిన 8,680 గ్రామాల్లో సభలు నిర్వహించగా 2.80 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. రీ సర్వే సరిగ్గా చేయలేదని, భూమి విస్తీర్ణం తగ్గించారని, రికార్డుల్లో తప్పులు ఉన్నాయని రైతులు ఫిర్యాదులు చేశారు. వీటిపై సర్వే శాఖ పరిశీలన చేయగా, అవన్నీ అప్పీల్స్ డీటీలు పరిష్కరించాల్సిన కేసులని నిర్ధారణ అయింది. వీరు గత ప్రభుత్వంలో కేసుల పరిష్కారం ఎందుకు చేయలేకపోయారని అధికారులు ఆరా తీశారు. అప్పీల్స్ వ్యవస్థ చట్టప్రకారం, నిబంధనల మేర కు పని చేయలేదన్న నిర్ధారణకు వచ్చారు. నేరుగా కొందరు డీటీలతో మాట్లాడగా.. తమకు డబుల్ పోస్టులు ఇచ్చారని, రీ సర్వే పని కాకుండా మిగతా వర్క్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని కొందరు డీటీలు చెప్పారు. మరి 4.20 లక్షల అప్పీల్స్‌ను ఎలా పరిష్కరించారని ఆరా తీయగా.. అదంతా కాగితాలపైనే జరిగిందని కొందరు అధికారులు తేల్చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన తర్వాతే బుధవారం నాటి అప్పీల్స్ డీటీల సమావేశంలో సీసీఎల్‌ఏ జయలక్ష్మి, సర్వే డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డిలు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అప్పీల్స్‌ను పరిష్కరించకపోతే సస్పెండ్ చేస్తానని సీసీఎల్‌ఏ తీవ్ర హెచ్చరికలు చేశారు.
ఇప్పటికైనా దారికొస్తారా?
ప్రస్తుతం 697 గ్రామాల్లో రీ సర్వే కొత్తగా పైలెట్ ప్రాజెక్టుగా సాగుతోంది. కూటమి ప్రభుత్వంలోనూ అప్పీల్స్ డీటీలు అసలు పనికన్నా కొసరు పనులపైనే ఎక్కువ దృష్టిపెడితే ఎలా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రెవెన్యూ శాఖ ఇదే అంశంపై దృష్టిసారించినట్లు కనిపిస్తోంది. బుధవారం నిర్వహించిన అప్పీల్స్ డీటీల సమావేశంలో.. ఇకపై వారం వారం పనితీరు నివేదికలు పంపించాలని టార్గెట్ పెట్టింది. రైతుల సమస్యలు పరిష్కరించని పక్షంలో సస్పెన్షన్‌కు గురికావాల్సి ఉంటుందని సీసీఎల్‌ఏ హెచ్చరించారు. ప్రతీ మూడు నెలలకోసారి డీటీల పనితీరును సమీక్షిస్తామని, తప్పు చేసినట్లు తేలితే వెంటనే రివర్షన్ ఇస్తామని సర్వే డైరెక్టర్ హెచ్చరించారు. మరి ఇప్పటికైనా డీటీలు రీ సర్వే సమస్యలపై దృష్టిపెట్టి, రైతుల కష్టాలు తీరుస్తారా?