Share News

304 AES Approved: ఆర్‌అండ్‌బీకి సచివాలయాల ఇంజనీరింగ్‌ సిబ్బంది

ABN , Publish Date - May 09 , 2025 | 05:13 AM

ఆర్‌అండ్‌బీ శాఖలో ఏఈల కొరత తీర్చేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ఇంజనీరింగ్‌ సిబ్బందిని వినియోగించేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం ఇచ్చారు. ప్రస్తుతానికి 304 పోస్టులను తక్షణ అవసరంగా గుర్తించి వినియోగించనున్నారు

304 AES Approved: ఆర్‌అండ్‌బీకి సచివాలయాల ఇంజనీరింగ్‌ సిబ్బంది

  • ఏఈలుగా 304 మంది సేవల వినియోగానికి సీఎం గ్రీన్‌సిగ్నల్‌

అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అనే క కొత్త రహదారి ప్రాజెక్టులను చేపట్టిన రోడ్లు భవనాల శాఖలో సిబ్బంది కొరతను తీర్చాలని సర్కారు నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న సివిల్‌ ఇంజనీరింగ్‌ సిబ్బందిని ఆర్‌అండ్‌బీ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఆర్‌అండ్‌బీలో అసిస్టెంట్‌ ఇంజనీర్ల(ఏఈల) కొరత తీవ్రంగా ఉంది. కనీసం 304 పోస్టులు తక్షణ అవసరమని సీఎం దృష్టికి ఆర్‌అండ్‌బీ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న 304 మంది ఏఈలను ఆర్‌అండ్‌బీ ఉపయోగించుకొనేలా ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలో ఖరారు చేయనున్నారు.


ఆర్‌అండ్‌బీ శాఖ పనితీరుపై గురువారం సచివాలయంలో సీఎం సమీక్ష చేశారు. ప్రస్తుతం ఆర్‌అండ్‌బీకి చేతినిండా పని ఉంది. రూ.860 కోట్లతో రహదారి మరమ్మతులు 97 శాతం పూర్తిచేశారు. కొత్తగా మరో రూ.3200 కోట్లతో రహదారి విస్తరణ, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఏఈల కొరత తీవ్రంగా ఉందని సీఎంకు ఆ శాఖ నివేదించింది. సచివాలయాల ఇంజనీరింగ్‌ సిబ్బందిని ఆర్‌అండ్‌బీలో వినియోగించుకోవడం వల్ల క్షేత్రస్థాయి సిబ్బంది కొరత తగ్గుతుందని, ప్రాజెక్టులను వేగంగా చేపట్టవచ్చని సీఎం చెప్పారు. కాగా, రాష్ట్రంలో రహదారి మరమ్మతులు, విస్తరణ, అభివృద్ధి పనుల కోసం ఏటా ఆర్‌అండ్‌బీకి 2వేల కోట్ల నిధులివ్వాలని ఆర్‌అండ్‌ బీ మంత్రి జనార్ధన్‌రెడ్డి కోరారు.

Updated Date - May 09 , 2025 | 05:13 AM