Fake Websites: భక్తులను మోసగిస్తున్న 28 నకిలీ వెబ్‌సైట్లు తొలగింపు
ABN , Publish Date - Aug 14 , 2025 | 05:37 AM
శ్రీవారి భక్తులే లక్ష్యంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న 28 నకిలీ వెబ్‌సైట్లను గూగుల్ సెర్చ్ ఇంజన్ నుంచి తొలగించారు...
తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి భక్తులే లక్ష్యంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న 28 నకిలీ వెబ్‌సైట్లను గూగుల్ సెర్చ్ ఇంజన్ నుంచి తొలగించారు. శ్రీవారి దర్శన టిక్కెట్లు, తిరుమలలో వసతి పేరిట కొన్ని నకిలీ వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి. వీటిపై నిఘాకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు ఆదేశాలతో తిరుమల పోలీసులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వీరి నిఘాలో దర్శనం, వసతి పేరిట 30కి పైగా నకిలీ వెబ్‌సైట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 28 వెబ్‌సైట్లను గూగుల్ సెర్చ్ ఇంజన్ నుంచి తొలగించారు. మిగతా వాటినీ తొలగించడానికి చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తిరుమలలో వసతికి అతిథి గృహాల పేరిట వెబ్‌సైట్లు ఉంటే అవి నకిలీవని గుర్తించాలన్నారు. భక్తులు టీటీడీ సేవల కోసం అధికారిక వెబ్‌సైట్ ‘తిరుమల.ఓఆర్‌జీ’ని మాత్రమే ఉపయోగించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.