రూ.2.50 కోట్ల స్థలం హాంఫట్
ABN , Publish Date - Feb 03 , 2025 | 01:03 AM
కూటమి ప్రభుత్వం వచ్చినా వైసీపీ నేతల భూ ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. అజితసింగ్‌నగర్ సన్‌సిటీ కాలనీలో కోట్ల రూపాయలు విలువ చేసే ఇరిగేషన్ స్థలాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనుచరుడు ఒకరు ఆక్రమించాడు. సర్వే నంబర్లు మార్చి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించాడు. గుట్టుగా కొడుకుల పేర నూజివీడులో రిజిసే్ట్రషన్ ప్రక్రియ పూర్తి చేశాడు. ఇప్పుడు కొలతలు వేసి సదరు స్థలంలో నిర్మాణాలకు పూనుకున్నాడు.

- సన్‌సిటీ కాలనీలో ఇరిగేషన్ స్థలం వైసీపీ నేత ఆక్రమణ
- సర్వే నంబర్ మార్చి కొడుకులకు వీలునామా
- గుట్టుచప్పుడు కాకుండా నూజివీడులో రిజిసే్ట్రషన్
- పొజిషన్‌లోకి వచ్చేందుకు ప్రయత్నాలు
- గత వైసీపీ పాలనలోనే కబ్జా యత్నం
- అప్పట్లో వరుస కథనాలతో అడ్డుకున్న ఆంధ్రజ్యోతి
కూటమి ప్రభుత్వం వచ్చినా వైసీపీ నేతల భూ ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. అజితసింగ్‌నగర్ సన్‌సిటీ కాలనీలో కోట్ల రూపాయలు విలువ చేసే ఇరిగేషన్ స్థలాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనుచరుడు ఒకరు ఆక్రమించాడు. సర్వే నంబర్లు మార్చి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించాడు. గుట్టుగా కొడుకుల పేర నూజివీడులో రిజిసే్ట్రషన్ ప్రక్రియ పూర్తి చేశాడు. ఇప్పుడు కొలతలు వేసి సదరు స్థలంలో నిర్మాణాలకు పూనుకున్నాడు.
అజితసింగ్‌నగర్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): అజితసింగ్‌నగర్ సన్‌సిటీ కాలనీలోని ఇరిగేషన్ స్థలాలు భూ రాబందుల చెరలోకి వెళ్లిపోతున్నాయి. స్థానికంగా ప్రభుత్వ భూములపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కబ్జా దారులకు వరంలా మారింది. గత వైసీపీ పాలనలో ఇదే కాలనీలో ఇరిగేషన్ భూముల కబ్జాకు ప్రయత్నించి విఫలమైన ఓ వైసీపీ నేత మరోసారి కాలనీపై వాలిపోయాడు. ఈ సారి ఏకంగా ఇరిగేషన్ భూమిని తన ఇద్దరు కొడుకులకు గిఫ్ట్ కింద ఇచ్చేసినట్టు రిజిస్ర్టేషన్ చేయించేసి పొజిషన్‌లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
పాత డాక్యుమెంట్లు పుట్టించి..
స్థానిక సన్‌సిటీ కాలనీలోని సర్వే నంబరు 32లో 1.20 ఎకరాలు ఇరిగేషన్ స్థలం ఉంది. అందులో రూ.2.50 కోట్లు విలువ చేసే 550 గజాలు భూమికి నకిలీ పత్రాలు సృష్టించిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనుచరుడు భూమి తనదంటూ రంగంలోకి దిగిపోయాడు. తన తండ్రి తనకు వీలునామా రాశాడంటూ ఏకంగా ఇరిగేషన్ స్థలానికి పాత డాక్యుమెంట్లు పుట్టించాడు.
గుట్టు చప్పుడు కాకుండా నూజివీడులో రిజిసే్ట్రషన్
నగరంలో సదరు స్థలాలు రిజిసే్ట్రషన్ చేస్తే కబ్జా వ్యవహారం బయట పడుతుందని భయపడ్డ వైసీపీ నేత గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్ విధానం ఉపయోగించుకుని నూజివీడులో రిజిసే్ట్రషన్ చేయించేశాడు. తన ఇద్దరు కుమారులకు ఒక్కొక్కరికి 225 గజాల చప్పున ఇద్దరికి 550 గజాలు రిజిసే్ట్రషన్ చేయించి ఇప్పుడు ఆ భూములు తనవని కలరింగ్ ఇస్తున్నాడు. రెండు రోజుల కిందట కబ్జా స్థలాల్లోకి వెళ్లి కొలతలు కూడా వేయించినట్లు స్థానికులు చెబుతున్నారు. రేపోమాపో నిర్మాణాలు చేపట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
నాడే కబ్జాకు యత్నం.. అడ్డుకున్న ‘ఆంధ్రజ్యోతి’
అయితే ఈ కబ్జాకు ప్రణాళికంతా గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. భూముల కబ్జాలో తిమింగళంగా పేరున్న వైసీపీ నేత అప్పట్లోనే నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ప్రభుత్వ స్థలంలో ఆక్రమణకు దిగాడు. ఈ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ 2023 జూలై 16, 17, 18వ తేదీల్లో వరుస కథనాలు ప్రచురించింది. దీంతో అధికారులు అక్కడికి చేరుకుని బోర్డులు ఏర్పాటు చేయడంతో వైసీపీ నేత అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. అనంతరం తిరిగి ఇప్పుడు ఈ స్థలంలోకి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.
రిజిసే్ట్రషన్ చేయించింది ఇలా..
సన్‌సిటీ కాలనీలోని ఇరిగేషన్ భూములను తన కొడుకుల పేరు మీద రిజిసే్ట్రషన్ చేయించుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకుని అన్ని రకాల అడ్డదారులను తొక్కాడు. ఇరిగేషన్ స్థలం 32వ సర్వే నంబరులో ఉండగా, ప్రస్తుతం సదరు సర్వేలోని భూములు రిజిసే్ట్రషన్ అవకపోవడంతో అదే స్థలానికి పక్కనే ఉన్న రిజిస్ట్రర్ భూముల్లోని సర్వే నంబరు 31/1ఏ పేరుతో రిజిసే్ట్రషన్ చేయించినట్లు తెలుస్తోంది. 31/1ఏ రిజిసే్ట్రషన్‌తో 32వ నంబరు సర్వే భూముల్లో ఉన్న 550 గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.