Share News

Karedu Farmers: కరేడు రైతులకు ఎకరాకు రూ.20లక్షలు

ABN , Publish Date - Jul 30 , 2025 | 05:55 AM

నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు ప్రాంతంలో ఇండోసోల్‌ పరిశ్రమకు చేపడుతున్న భూసేకరణ ప్రక్రియలో

Karedu Farmers: కరేడు రైతులకు ఎకరాకు రూ.20లక్షలు

  • ఫలించిన కలెక్టర్‌ చర్చలు

  • భూసేకరణ ప్రక్రియలో కీలక పరిణామం

నెల్లూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు ప్రాంతంలో ఇండోసోల్‌ పరిశ్రమకు చేపడుతున్న భూసేకరణ ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమారు వంద ఎకరాలకు సంబంధించిన రైతులు, ఇండోసోల్‌ ప్రతినిధులు, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం రాత్రి నెల్లూరులో కలెక్టర్‌ ఆనంద్‌తో చర్చించారు. పరిహారం పెంపు, ఉపాధి కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు. భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ.12.50 లక్షలు పరిహారంగా ఇచ్చేలా ఇది వరకే నిర్ణయించారు. అయితే ఆ మొత్తాన్ని రూ.20 లక్షలకు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ భూముల్లో హార్టికల్చర్‌, ఆక్వాకల్చర్‌ సాగు ఉంటే అదనంగా ఎకరాకు రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకూ ఇవ్వనున్నారు. అలాగే కరేడు ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుతో 30 వేల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, అందులో కనీసం 6 వేల ఉద్యోగాలు స్థానికులకు దక్కుతాయని కూడా కలెక్టర్‌ రైతులకు వివరించారు. భూములు కోల్పోయిన ప్రతీ కుటుంబానికి ఒక ఉద్యోగం దక్కుతుందని తెలిపారు. దీంతో రైతులు సానుకూలంగా స్పందించారు. రూ.20 లక్షల చొప్పున ధర ఇస్తే భూములు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని రైతులు అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఈ చర్చలపై కలెక్టర్‌ ఆనంద్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతులకే ఈ ధర వర్తిస్తుందని స్పష్టం చేశారు. రైతులతో చర్చించేందుకు తామెప్పుడూ సిద్ధంగానే ఉన్నామని వెల్లడించారు.

Updated Date - Jul 30 , 2025 | 06:36 AM