Share News

Urban Development: ఇంటి నిర్మాణ అనుమతికి రూపాయే

ABN , Publish Date - Jun 25 , 2025 | 04:57 AM

భవన, లేఅవుట్ల అనుమతుల నిబంధనల్లో చేపట్టిన సవరణలకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చిన్న భవనాలకు అనుమతుల్లో వెసులుబాటు కల్పించారు.

Urban Development: ఇంటి నిర్మాణ అనుమతికి రూపాయే

  • 50 చ.మీ.లలో చేపట్టే వాటికి వర్తింపు

  • అన్ని రకాల భవనాలకూ సీసీ కెమెరాలు

  • భవన, లేఅవుట్ల అనుమతుల్లో సవరణ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం

అమరావతి, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): భవన, లేఅవుట్ల అనుమతుల నిబంధనల్లో చేపట్టిన సవరణలకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చిన్న భవనాలకు అనుమతుల్లో వెసులుబాటు కల్పించారు. గతంలో బాల్కనీలకు అనుమతి లేదు. ఇప్పుడు అవకాశం కల్పించారు. ఒక్క రూపాయి ఫీజుతో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు అనుమతి లభించనుంది. సెట్‌బ్యాక్‌ విషయంలో వెసులుబాటు కల్పించారు.


  • 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే జీ, జీ+ భవనాలకు కేవలం ఒక్క రూపాయి ఫీజు మాత్రమే చెల్లించి అనుమతి తీసుకోవచ్చు. ఈ వెసులుబాటు వల్ల దాదాపు 10 శాతం మంది భవన అనుమతిదారులకు లబ్ధి చేకూరుతుంది.

  • 3 మీటర్ల ఎత్తు దాటిన భవనాలకు బాల్కనీలు గరిష్ఠంగా 1.5 మీటర్ల వెడల్పుతో నిర్మించేందుకు అనుమతి ఇచ్చారు. అన్ని రకాల భవనాలు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, హోటల్స్‌, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లకు సీసీ కెమెరాలను తప్పనిసరి చేశారు.

  • 9 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్లలో కూడా పరిశ్రమల స్థాపనకు అనుమతి(రెడ్‌ కేటగిరి మినహా), రెడ్‌ కేటగిరి పరిశ్రమల ఏర్పాటుకు 12 మీటర్ల వెడల్పు కలిగిన రోడ్డు తప్పనిసరి.

  • 100 చదరపు మీటర్ల ప్లాట్‌లకు 2 మీటర్ల వెడల్పు ఉన్న అంతర్గత రోడ్డు, 100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విసీర్ణం ఉన్న ప్లాట్లకు 3.6 మీటర్ల వెడల్పు ఉన్న అంతర్గత రోడ్డు ఉంటే సరిపోతుంది.


సెట్‌బ్యాక్‌లో మార్పులు

  • 100 చదరపు మీటర్లలోపు ప్లాట్లకు సెట్‌ బ్యాక్‌లు అవసరం లేదు. 1 మీటర్‌ నుంచి 3 మీటర్ల వరకు ఫ్రంట్‌ సెట్‌ బ్యాంక్‌ ఉండాలి. 100 చ.మీ నుంచి 500 చ.మీ విస్తీర్ణం ఉన్న ప్లాట్‌కు 0.75-2 మీటర్ల ఫ్రంట్‌ సెట్‌బ్యాక్‌ ఉండాలి. 500 చ.మీ నుంచి 2500 చ.మీ విస్తీర్ణం ఉన్న ప్లాట్లకు 3-5.5 మీటర్ల ఫ్రంట్‌ సెట్‌ బ్యాక్‌ ఉండాలి. 300 చ.మీ కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు సెల్లార్‌ పార్కింగ్‌కు అనుమతి. అదే ప్లాట్‌లో సెట్‌బ్యాక్స్‌ మార్చుకునేందుకు అవకాశం కల్పించారు.

  • ఇరుకుగా ఉండే ప్లాట్లకు సెట్‌బ్యాక్స్‌ సరిచేసుకోవచ్చు. ఫ్రంట్‌ సెట్‌బ్యాక్‌ ప్రాంతంలో సెక్యూరిటీ పోస్టు ఏర్పాటుకు అనుమతి. బిల్డింగ్‌, సెట్‌బ్యాక్‌ ప్రాంతంలో ఫ్రంట్‌ సెట్‌బ్యాక్‌లో కాకుండా మిగిలిన సెట్‌బ్యాక్‌లతో ఎస్టీపీ, ఈటీపీ ఏర్పాటుకు అనుమతి.

  • ఒక సైట్‌లో 18 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్లు రెండు కంటే ఎక్కువ ఉంటే 45 మీటర్ల ఎత్తు వరకూ నిర్మాణానికి అనుమతి ఇస్తారు. 24 మీటర్ల వెడల్పు గల రోడ్లు రెండు కంటే ఎక్కువ ఉంటే 50 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణానికి అనుమతి.

  • తడి, పొడి చెత్త వ్యర్థాల నిర్వహణ ప్రతి భవనంలో తప్పనిసరిగా చేపట్టాలి.

  • భవన అనుమతులకు ఎలాంటి టీడీఆర్‌ అయినా ఫర్వాలేదు. రోడ్ల వెడల్పు 18 మీటర్లలోపు దాని కంటే ఎక్కువ ఉన్న చోట్ల ఫ్రంట్‌, ఇతర సెట్‌ బ్యాక్‌లలో మార్పులు చేసుకోవచ్చు.

  • చిన్న చిన్న ప్లాట్లకు రోడ్డు విషయంలో సడలింపులిచ్చారు.

Updated Date - Jun 25 , 2025 | 04:57 AM