Share News

యాదాద్రి థర్మల్‌కు రెండో దశ పర్యావరణ అనుమతి!

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:54 AM

యాదాద్రి థర్మల్‌ పవర్‌ కేంద్రానికి రెండో దశ పర్యావరణ అనుమతులు సిఫారసు చేస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ(ఈఏసీ) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5న ఈఎసీ సమావేశం

యాదాద్రి థర్మల్‌కు  రెండో దశ పర్యావరణ అనుమతి!

కేంద్రానికి నిపుణుల కమిటీ సిఫారసు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి థర్మల్‌ పవర్‌ కేంద్రానికి రెండో దశ పర్యావరణ అనుమతులు సిఫారసు చేస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ(ఈఏసీ) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5న ఈఎసీ సమావేశం జరగ్గా.. ఇందుకు సంబంధించిన వివరాలు బుధవారం బయటికొచ్చాయి. నిజానికి, పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయనే కారణంతో జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) ఈ కేంద్రానికి పర్యావరణ అనుమతిని సస్పెండ్‌ చేసింది. మళ్లీ పర్యావరణ అనుమతి కోసం టర్మ్‌ అండ్‌ రిఫరెన్స్‌ జారీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. రెండో దశ పర్యావరణ అనుమతి తీసుకునే దాకా ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి వీల్లేదని ఎన్‌టీజీ ఆదేశించింది. దాంతో ప్లాంట్‌ పనులు పూర్తికావస్తున్నప్పటికీ విద్యుత్‌ ఉత్పత్తి దిశగా అధికారులు అడుగులు వేయలేదు. ఈ నేపథ్యంలో గతేడాది నవంబరు 8న అదనపు టర్మ్‌ అండ్‌ రిఫరెన్స్‌ ఆధారంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి మళ్లీ జెన్‌కో ప్రతిపాదనలు సమర్పించారు. దీంతో నిపుణుల మదింపు కమిటీ రెండో దశ పర్యావరణ అనుమతికి కేంద్ర పర్యావరణ అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. 4000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన యాదాద్రి సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులు 2017 అక్టోబరు 17న ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టును ఐదు యూనిట్లుగా విభజించి 2025 ఫిబ్రవరి నాటికి ప్లాంట్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులో తేవాలని నిర్ణయించారు. కాగా, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణాలపై మరోవైపు జస్టిస్‌ ఎల్‌ .నర్సింహారెడ్డితో ప్రభుత్వం విచారణ జరుపుతున్న విషయం విదితమే. టెండర్లు పిలవకుండా ఏకపక్షంగా నామినేషన్‌పై ప్లాంట్‌ నిర్మాణ పనులు అప్పగించడంతో ప్రభుత్వానికి భారీగా నష్టం జరిగిందనేది వాదన. ఇక ప్లాంట్‌లోని ఎలకో్ట్రమెకానికల్‌ పనులు మాత్రమే బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించి, మిగిలిన పనులను తమ వారికి గత ప్రభుత్వం కట్టబెట్టిందనే విమర్శలూ ఉన్నాయి. ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో రెండో దశ పర్యావరణ అనుమతికి సిఫారసు చేస్తూ కమిటీ కొన్ని షరతులు విధించింది.

  • మూడు వరుసల్లో మొక్కలు నాటాలి. ఈ ప్రక్రియ 2024 జూన్‌ నాటికి పూర్తి కావాలి.

  • సామాజిక బాధ్యత కింద పనులు చేపట్టేందుకు రూ.100.40 కోట్లు కేటాయించాలి.

  • థర్మల్‌ కేంద్రం నుంచి వెలువడే బూడిదను వంద శాతం వినియోగించాలి.

  • ప్లాంట్‌కు 10కిమీ లోపు నివాసిగతుల ఆరోగ్యంపై దృష్టిసారించాలి. ఉచిత వైద్యసేవలు అందించాలి.

Updated Date - Apr 25 , 2024 | 03:54 AM