Share News

అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పర్యవేక్షణలోనే పనిచేశా

ABN , Publish Date - May 09 , 2024 | 05:15 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టీ ప్రభాకర్‌ రావు మొదటిసారి కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఎస్‌ఐబీ చీఫ్‌గా తనకు పూర్తి

అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పర్యవేక్షణలోనే పనిచేశా

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు అఫిడవిట్‌

హైదరాబాద్‌ సిటీ, మే 8 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టీ ప్రభాకర్‌ రావు మొదటిసారి కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఎస్‌ఐబీ చీఫ్‌గా తనకు పూర్తి అధికారులు లేవని, తన పనిని డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఎప్పుడూ పర్యవేక్షిస్తుండేవారని పేర్కొన్నారు. ఒకే కులానికి చెందినవాడిని కావడం వల్లే మాజీ సీఎం కేసీఆర్‌ తనను ఎస్‌ఐబీ చీఫ్‌గా నియమించారన్న పోలీసుల అభియోగాన్ని ఖండించారు. తన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని డీఐజీ సిఫారసు చేశారని తెలిపారు. తాను కేసీఆర్‌ కులానికే చెందినవాడిని కావడం ఆరోపణలు మోపడానికి ప్రాతిపదిక కాకూడదని పేర్కొన్నారు. తాను నల్లగొండ ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఇదే కేసీఆర్‌ తనను ఆకస్మికంగా బదిలీ చేశారన్నారు. తాను ప్రతిపక్ష నాయకులకు సహకరిస్తున్నానంటూ ఆ జిల్లా నాయకుల నుంచి కేసీఆర్‌కు వచ్చిన ఒత్తిళ్లే తన బదిలీకి కారణమన్నారు. అంతేకాకుండా చాలారోజులు పోస్టింగ్‌ ఇవ్వకుండా పక్కన పెట్టారన్నారు. పదోన్నతుల్లో కూడా అన్యాయం జరిగిందంటూ తాను కూడా కేసీఆర్‌ బాధితుడేనన్నారు. అధికారంలో ఉన్న వారి ఆదేశాలపై తనను నిందితుడిని చేశారని పేర్కొన్నారు. కాగా, అమెరికాలో ఉన్న ప్రభాకర్‌ రావుపై అరెస్టు వారెంట్‌ ఇవ్వాలని, తద్వారా తాము రెడ్‌ కార్నర్‌ నోటీసు కోరవచ్చని పోలీసులు కోర్టును కోరారు. దీనిని వ్యతిరేకిస్తూ ప్రభాకర్‌ రావు తరఫున ఆయన సీనియర్‌ న్యాయవాది వీ సురేందర్‌ ఈ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ప్రభాకర్‌ రావు పరారీలో లేరని, క్యాన్సర్‌ చికిత్స కోసం అమెరికా వెళ్లారని, చికిత్స పూర్తయ్యాక తిరిగి వచ్చేస్తారని పేర్కొన్నారు. ప్రభాకర్‌ రావు అఫిడవిట్‌ పోలీసు ఉన్నతాధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని చర్చించుకుంటున్నారు.

Updated Date - May 09 , 2024 | 08:20 AM