Share News

అంకిత భావంతో పని చేయాలి

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:17 PM

ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా, అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు.

 అంకిత భావంతో పని చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

కలెక్టర్‌ నారాయణరెడ్డి

వికారాబాద్‌, జూన్‌ 11 : ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా, అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కేజీవీబీ వసతి గృహాలు, గురుకులాల నిర్వహణపై సంక్షేమ అధికారులు, గురుకులాల ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ ప్రత్యేక అధికారులచే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం వసతి గృహాల నిర్వహణలో భాగంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ఎంతో డబ్బును వెచ్చిస్తుందని అయినప్పటికీ ఉత్తీర్ణత శాతం అనుకున్న స్థాయిలో లేకపోవడం దురదృష్టకరమని కలెక్టర్‌ అన్నారు. మనము పొందుతున్న జీతానికి న్యాయం చేస్తున్నామా? పని చేయకపోవడం వల్ల ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి అనే కోణంలో ఆలోచించి వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని అధికారులకు హితవుపలికారు. వసతి గృహాల్లోని విద్యార్థుల ఉత్తీర్ణత ఈ దఫా 70 శాతానికి తగ్గకుండా పని చేయాలని ఆయన తెలిపారు. పైవ్రేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా పోటీ పడాలని అన్నారు. వసతి గృహాలు, గురుకుల పాఠశాలలల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు విలువ గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బంది సహకారం తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

తల్లిదండ్రుల పాత్ర పోషించాల్సింది మనమే

గ్రామీణ, మధ్యతరగతికి చెందిన అత్యంత పేద కుటుంబాల పిల్లలు వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తారని, తల్లిదండ్రుల పాత్రను పోషిస్తూ వారి బాగోగులను చూడాల్సిన బాధ్యత కూడా సంబంధిత అధికారులదేనని కలెక్టర్‌ అన్నారు. వసతి గృహాల్లో సబ్జెక్టుల వారీగా ట్యూటర్లను నియామకం చేసుకొని రాజీ పడకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, వెనుకబడిన కులాల అభివృద్ధి అధికారి ఉపేందర్‌, టిజీఎస్‌ డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ రీజినల్‌ కోఆర్డినేటర్‌ శారద వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2024 | 11:17 PM