Share News

బాధితులకు సత్వరన్యాయం జరిగేలా పనిచేయాలి

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:05 AM

వివిధ సమస్యలపై పోలీ్‌సస్టేషన్లకు వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ చందనా దీప్తి అన్నారు.

బాధితులకు సత్వరన్యాయం జరిగేలా పనిచేయాలి
అర్జీదారులతో మాట్లాడుతున్న ఎస్పీ చందనాదీప్తి

నల్లగొండ టౌన్‌, ఫిబ్రవరి 5 : వివిధ సమస్యలపై పోలీ్‌సస్టేషన్లకు వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ చందనా దీప్తి అన్నారు. సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌ డే సందర్భంగా 35 మంది అందించిన అర్జీలను తీసుకుని వారితో నేరుగా మాట్లాడారు. అదేవిధంగా సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. భూసమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఫైనాన్స్‌ సమస్యలపైన ఫిర్యాదు అధికంగా అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీ్‌సశాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజాసమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తున్నామన్నారు. ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి, వేగంగా స్పందించాలన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూసి ఫిర్యాదుదాడికి భరోసా, నమ్మకం కలిగించాలన్నారు. ప్రతీ ఫిర్యాదునూ ఆన్‌లైన్‌లో పొందుపరిచి ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు.

పారదర్శకంగా ఈవీఎంల తనిఖీలు : కలెక్టర్‌

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఈవీఎం యంత్రాల తొలి దశ తనిఖీ(ఎఫ్‌ఎల్‌సీ)లను పారదర్శకంగా నిర్వహించినట్లు కలెక్టర్‌ హరిచందన దాసరి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలోని ఈవీఎం గోడౌన్‌ వద్ద యంత్రాల ఎఫ్‌ఎల్‌సీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించి, మాట్లాడారు. పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు సిద్ధం చేయడం కోసం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాకు వచ్చిన 4,222 బ్యాలెట్‌ యూనిట్లు, 22 శాతం కంట్రోల్‌ యూనిట్లు, 2,784 వీవీప్యాట్‌ యంత్రాల పనితీరును పరిశీలించామన్నారు. ఈ నెల 14వరకు పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ జే.శ్రీనివాస్‌, ఎన్నికల డీటీవీ విజయ్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 12:05 AM