గాలి వాన బీభత్సం
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:10 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది.

ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల విరిగిన స్తంభాలు.. విద్యుత్ సరఫరాకు అంతరాయం
చండూరు పట్టణం జలమయం
యాదాద్రి, జూన్6 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు పలు గ్రామాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తం భాలు నేల కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో 46.0మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదగిరిగుట్టలో 35.5మిల్లీమీటర్లు, వలిగొండలో 27.0 మిల్లీమీటర్లు, నారాయణపూర్‌లో 15.3మిల్లీమీటర్లు, గుండాలలో 1.5 మిల్లీమీటర్లు, మోత్కురులో 0.5మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రి వేళలో ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో భక్తులు ఇబ్బందులు పడ్డారు.
మద్దిరాలలో మండలంలో ఐదు సెంటిమీటర్ల వర్షపాతం
మద్దిరాల: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో గాలి వాన బీభ త్సం సృష్టించాయి. పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మండలంలో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జి.కొత్తపల్లిలో రంగారావు ఇంటిపై చెట్టు పడడంతో రేకులు ధ్వంసమయ్యాయి.
భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లిలో గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు భారీ వర్షం కురిసింది. దీం తో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపై వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
వలిగొండ: మండలంలో పలు గ్రామాలల్లో గురువారం మోస్తరు వర్షం కురిసింది. చల్లని గాలులతో ఉరుములు మెరపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలులకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట పట్టణంలో గురువారం సాయంత్రం 20 నిమిషాలపాటు కురిసింది. దీంతో పాదచారులు, వాహనదారులు కొంతవరకు ఇబ్బందులకు గురయ్యారు.
పొంగిన వాగులు
చండూరు రూరల్: వర్షానికి మండలంలోని పడమటితాళ్ల, చామలపల్లి, తాస్కానిగూడెం గ్రామాల్లోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. వర్షాకాలం రాకమునుపే తొలకరి పలకరింపుతోనే మండల వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు పడమటితాళ్ల వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం నిండి పొంగి పొర్లుతుండటంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.
చండూరు: చండూరులో బుధవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి పట్టణం జలమయమైంది. కస్తూర్బాగాంధీ పాఠశాల ఎదుట ఉన్న పట్టణ ప్రధాన రహదారిపై నీరు ఎక్కువ లోతులో నిలిచిపోవడంతో వాహనదారులు ఇతర మార్గాల ద్వారా రాకపోకలు సాగించారు. ఇక్కడ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన డ్రైనేజీ పనులను కాంట్రాక్టర్ అసంపూర్తిగా వదిలేశాడు. డ్రైనేజీలో నిలిచిన మురుగు నీరు ప్రధాన రహదారిపైకి రావడంతో వాహనదారులు, దుకాణదారులు, ఇబ్బంది పడ్డారు. రోడ్డు విస్తరణ పనులు పునః ప్రారంభించాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని చండూరు మున్సిపాలిటీ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న ఆరోపించారు. వర్షాకాలం ఆరంభంలోనే పట్టణమంతా జలదిగ్భందమైందన్నారు.
వర్షం వస్తే చాలు రోడ్లన్నీ చిత్తడే
మర్రిగూడ: రెండు రోజులుగా మండలంలో కురుస్తున్న వర్షాలకు శివన్నగూడెం నుంచి మేటిచందాపురం, ఇందూర్తి, కొట్టాల, నామాపురానికి వెళ్లే రోడ్లు నుంచి వాహనదారులు వెళ్లే పరిస్థితి లేదు. శివన్నగూడెం ను ంచి నామాపురం వెళ్లే రోడ్డు వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారింది. ప్రయాణికులు, బాటసారులు, ద్విచక్రవాహనదారులు గుంతలలో పడి ప్రమాదానికి గురవుతున్నారు.