మెదక్‌లో కాంగ్రెస్‌ను గెలిపిద్దాం
ABN , Publish Date - May 05 , 2024 | 05:13 AM
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని, తద్వారా రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకునే ఆస్కారం ఉంటుందని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ
రాహుల్‌గాంధీని ప్రధానిని చేసుకుందాం
నలభై ఏళ్ల కిందట ఇందిర ఇక్కడే గెలిచారు
ఆమె హయాంలో అనేక పరిశ్రమల ఏర్పాటు
గజ్వేల్‌లో కాంగ్రె్‌సకు 25వేల మెజారిటీ వస్తే
అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా: జగ్గారెడ్డి
గజ్వేల్/సంగారెడ్డి, మే 4 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని, తద్వారా రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకునే ఆస్కారం ఉంటుందని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌షోతోపాటు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 40 ఏళ్ల కిందట ఇదే నియోజకవర్గం నుంచి రాహుల్‌గాంధీ నానమ్మ దివంగత ఇందిరాగాంధీ గెలుపొంది ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. ఇందిరా గాంధీ హయాలోనే ఇక్కడ అనేక పరిశ్రమలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ సారి రాహుల్ గాంధీ ప్రధాని అయి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కనీసం 25వేల ఓట్ల మెజార్టీని అందిస్తే, ఇక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనుల బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు.
మల్లన్నసాగర్ నిర్వాసితులకు రావాల్సిన పరిహారాన్ని ఇప్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారులతో కలిసి గతంలో బీఆర్‌ఎస్ నేతలు.. కాంగ్రెస్ వాళ్లను ఆడుకున్నారని, ఇప్పుడు మనం ఆడుకుందామని అన్నారు. ఏ పోలీస్ కూడా కాంగ్రెస్ కార్యకర్తలను టచ్ చేయలేరని, కార్యకర్తలకు ఏదైనా జరిగితే తానే స్వయంగా వస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. కలెక్టర్, ఎస్పీ మొదలు ఇతర అధికారులందరూ మీరు చెప్పినట్టే పని చేస్తారని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టి.నర్సారెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.ఆంక్షారెడ్డి, జి.ఎలక్షన్‌రెడ్డి, ఎం.భూంరెడ్డి పాల్గొన్నారు.